ఇదియేమి యిటులాయె నినకులతిలక
యిదియంతయు నీమాయయే కాదా
నేడు నీనామ మేల నిలువదు నానాలుకపై
వేడుకగా రామచంద్ర వివరమేమి టయ్య
నేడు నీరూప మేల నిలువదు నామనసులోన
చూడచక్కని తండ్రి యీచోద్యమేమి
దినదినము నీయశో గీతికలుపాడు నానోరు
దినపతికులనాథ మూగదనము చెందనేల
మనసు నోరుపెగల నీయని మంకుదన మేటికి
వినుతశీల పూనినదా వివరమేమి
తెలిసె రామచంద్ర నీదు దివ్యతేజంబులోన నే
కలిసిపోయి కరిగిపోయి నిలచిపోయి నీయందే
తెలియనైతి కాలంబును తెలియనైతి యొడలిని
నిలువనిమ్ము నీలోనే నీరజాక్ష