22, జనవరి 2024, సోమవారం

బాలుడై యున్నాడు బ్రహ్మజనకుడు


నీలమేఘశ్యాముడు లీలగా నైదేండ్ల

బాలుడై యున్నాడు బ్రహ్మజనకుడు


గుణములు తన్నంట నట్టి గొప్పవాడు దేవ

గణములు తనవెంట బడెడు కరుణామయుడు

రణముల తన కోడు దైత్యగణముల వాడు ఘన

ఫణిరాజు తనకు మెత్తని పరుపగు వాడు


యోగుల హృదయంబులందు నుండెడు వాడు దైత్యు

లాగడములు చేయుచుండ నడ్డెడు వాడు

భోగబుధ్ధులకు దొరుకబోవని వాడు మునుల

యాగంబుల కండయగుచు సాగెడు వాడు


రాముడై పుట్టి నాడు భూమిమీదను పరం

ధాముడు శుభలక్షణుడు దశరథసుతుడు

కామన లీడేర దేవగణములకు నేడు మా

యామానువేషుడైన ఆదివిష్ణువు