నీవాడను నేనైతే గోవిందుడా నీవు
నావాడవు కావటోయి నారాయణుడా
హరేరామ యనగానే యానందించేవు
నరరూపము దాల్చినట్ఞి నారాయణుడా
కరుణాసాగరుడవన్న బిరుదమున్న వాడా
నరాధముడ దయజూపుము నారాయణుడా
నేరక నే దుమికితి సంసారసాగరమ్మున
తీరమేమీ కనరాదో నారాయణుడా
దారి చూపి రక్షించర నేరమెంచకుండ
కూరిమి స్నేహితుడవైన నారాయణుడా
చేరగోరు జీవాళిని చేదుకొందు విడువక
భారమంత నాదేనను నారాయణుడా
కోరికోరి నన్నేలు కొనుచు చిరునగవుల
వేరు కాదు మనమనే నారాయణుడా