కరివరదుడు హరి కమలాక్షుడు సురవరులకు బలికెను చిరుగవులతో
శరణుకోరి చనుదెంచిన వారికి సంతోషము కలిగించుచును
మీరెరిగినదే ఆరావణుడు మేదిని బుట్టిన నాభటు డేనని
దారుణశాపము బొంది మునులచే దానవుడై ప్రభవించెను నేడని
ఘోరాకారుడు కుంభర్ణునిది గూడ యిట్టిదే కద కథ వారిని
తీరదు నాకును సంహరింపక వారే కోరిన విధమున నటులని
మునుపటి హేమకశిపుడే చూడగ పుట్టెను నేడిటు రావణు డగుచును
తనయుని బాధలు పెట్టెడు వానిని దండించితి నే నరహరి రూపున
వనితాజనఘనతాపకారకుని వనిత నెపంబిడి రాముడనై యిక
యనిలో జంపెద తుళువ రావణుని మునులును కోరెద రిదియే యనుచును
రామవిక్రమము సురరంజకమగు క్షేమము సురనరవరులకు కలుగను
రామరాజ్యమే యాదర్శంబగు భూమిని యుగయుగముల రాజులకును
రామతత్త్వమే యోగశాస్త్రమగు భూమిని యోగివరేంద్రుల కెపుడును
రామనామమే భవతారకమగు భూమిని సర్వముముక్షువులకు నని