ఐనను నీకేల దయయన్నది రాదో
మానవేంద్ర రామచంద్ర మన్నించవు
నీదు దివ్యనామజపము నేను మానియున్న దెపుడు
నీదు మహిమాతిశయము నేను మరచియున్న దెపుడు
నీదు భక్తికోటిలోన నేను చేరకున్న దెపుడు
నీదు కృపామృతంబునకు నేను వేడకున్న దెపుడు
నిన్ను కాక యితరుల నే నెన్నడైన పొగడితినా
నిన్ను కాక యితరుల నే నెన్నడైన వేడితినా
నిన్ను మోక్షమొకటి కాక నేనితరము లడిగితినా
నిన్ను నమ్మి యుంటి ననుచు నీకు తెలియకున్నదా
నారద తుంబురుల వలె నాకు పాడుటయె రాదు
మారుతితో పోల్చదగిన మహాభక్తవరుడ కాను
నారాయణ మూర్తి వనుచు నమ్మి శరణు జొచ్చితిని
మారజనక యది చాలదొ మన్నించ నాబోంట్లను