రామా నాచేయి విడువరాదని తలచేవో
యేమీ వీడెంతయని యెంచి విడచేవో
నీదే నిర్ణయము కాని నీకు చెప్ప నెవడను
కాదను మౌననుము నేను నీదు సేవకుడను
వాదములకు తావెక్కడ భగవంతుని తోడ
నీదయకై యెదురుచూచు నీవాడను నేను
భక్తుడనని మనసులలో భావింతురు కొందరు
భక్తినటనపరుడననుచు భావింతురు కొందరు
భక్తుడనను కొందువో వ్యర్ధుడనే యందువో
శక్తికొలది సేవించెడు సామాన్యుడ నేను
మరల జన్మ లేకుండగ మన్నించగ నెంతువో
మరల పుట్టి నీకీర్తిని మహిని పాడమందువో
ధరాసుతావరా నీవు తలచినట్లే యగును
నరుడను నీయానతిపై నడచెదను నేను