నాకు ప్రసన్నుడవు కాకుందు విది యేమి
నీకు భక్తుడ గానో నీరేజనయన
నీకేల దయరాదు నిరుపమ గుణధామ
పాకారిబ్రహ్మాదిప్రస్తుతశుభనామ
సాకేతపురధామ లోకేశ రణభీమ
రాకేందువదన శ్రీరామ విజితకామ
నీకేల దయరాదు నీకొలువునకు చేరి
నీకీర్తిప్రభలను నింగిముట్టగ జేసి
నీకు సేవలు చేసి నీవాడనై మెలగి
నీకన్య మెఱుగక నేను చరించిన
నీకేల దయరాదు నీయాన మేఱకు
చీకాకు తనువుల చేరుచు వేమార్లు
నీకంటె దైవమే లోకాన లేడనుచు
నే కడిది చాటించి ప్రాకులాడిన గాని