చూడరే చూడరే సుజనులారా కడు
వేడుకతో శ్రీరాముని విభవమే చూడరే
చిరునవ్వులు చిందించే హరిని చూడరే హరి
సరసన కూర్చున్న సీతాసతిని చూడరే
హరి కటుప్రక్కన లచ్చుమన్నను చూడరే యిదే
హరిపదముల నుండిన హనుమన్నను చూడరే
చామరమును బట్టిన విభీషణుని జూడరే రఘు
రాముని సేవించెడు కపిరాజును చూడరే
భూమీశుని దీవించు మునిముఖ్యుల చూడరే జన
సామాన్యము నిండియున్న సభను చూడరే
పరమాత్ముని సభను చూచి పరవశించరే కడు
పరవశించి జయజయధ్వనులు చేయరే
హరిని చూచునట్టి భాగ్య మద్భుత మనరే యిక
తరియించితి మని లోలో తలచి పొంగరే