6, ఫిబ్రవరి 2023, సోమవారం

వట్టివిచారము లేల వలవని చింత లేల - తాళ్ళపాక చినతిరుమలయ్య సంకీర్తనం



  చి.అ. 5.రే. 1 పా. గుండక్రియ
వట్టివిచారము లేల వలవని చింత లేల
దిట్టతనాన రక్షించ దేవుఁ డుండగాను

తానె బుధ్ధెరిఁగితే తప్పు లేల వచ్చీని
మానక యేలిక లెస్స మన్నించుఁ గాక
మేనిలోఁ బాపము లేక మించిన భయ మేటికి
ఆనుకొని రక్షించ శ్రీహరి యుండఁగాను

చేరి తానె కొలిచితే జీత మేల తప్పీని
ధారకుఁడై దొరయే చేపట్టుఁ గాక
మారుముద్ర గాని మంచిమాడకు వట్టము లేల
తారుకాణగా హరి తానె రక్షించుఁ గాక

చనవె కలిగితేను సలి గేల తప్పీని
తన చెప్పినట్లు రాజు తాఁ జేసుఁ‌ గాక
పనివడి రాచవారి పసులకు బందె యేది
నను శ్రీవెంకట నాథుఁడు రక్షించఁగా


(సంపుటం 10 -  కీర్తన 25)



ఇది శ్రీతిరువెంగళనాథ దేవునికి తాళ్ళపాక అన్నమాచార్యుల కొమారుఁడు పెదతిరుమలాచార్యులు, పెదతిరుమలాచార్యుల కొమారుఁడు చినతిరుమలాచార్యుడు విన్నపం చేసిన ఆధ్యాత్మసంకీర్తన.


ఈరోజుల్లో జనసామాన్యం తాళ్ళపాక కవుల సంకీర్తన లన్నీ అన్నమయ్య సాహిత్యంగా వాడుక చేస్తున్నారు! 

అందమైన ఈకీర్తన భావం చూదాం.

పల్లవిలో అనవసరంగా ఎందుకు విచారపడుతూ ఉండటం తనకి? ఎందుకు అనవసరంగా మనస్సులో దిగులు పడుతూ ఉండటం తాను స్వల్పవిషయాలకు?. నన్ను రక్షించటానికి స్థిరమైన సంకల్పంతో దేవుడు లేడా? అని ప్రశ్న వేస్తున్నారు.

అలా ఎందుకు తాను ప్రశ్న చేసారన్నది కూడా చాలా చక్కగా సమర్ధింపులతో వివరిస్తున్నారు చూడండి.

తనకే తగినంత మంచి బుధ్ది కుశలత ఉంటే తప్పులెందుకు దొర్లుతాయి? తన యజమాని తప్పకుండా తనని చక్కగా మన్ననగా చూస్తాడు కాని? అలాగే మనం ఈశరీరంతో ఏతప్పూ చేయకపోతే పాపం ఉండదు కదా, పాపమే లేనప్పుడు భయం మాత్రం ఎందుకు ఉంటుంది? మనని అంటిపెట్టుకొని ఉండి రక్షించటానికి అప్పుడు మనకు శ్రీహరి ఉంటాడు కదా అంటున్నారు.  శరీరంలో తప్పులేకపోవటం అంటే మనోవాక్కాయకర్మలా శుధ్దంగా ఉండటం. అలా ఉంటే పాపమూ ఉండదు ఇంక భయమూ ఉండదు. మనకు రక్షణ కూడా ఉంటుంది హరి ద్వారా.  అంటే ఇక్కడ తానుత్రికరణ శుధ్ధి కలవాడను కాబట్టి పాపం అంటని వాడననీ తనకు ఏభయమూ లేదనీ హరి తనని రక్షించటానికి ఉన్నాడనీ అంటున్నారు. అందుచేత తనకి ఏవిచారమూ ఏచింతా లేదట.

మనం సరిగా పనిచేస్తే జీతం ఎందుకు తగ్గుతుంది? పని చేయ నప్పుడే కదా యజమాని జీతం విరుగగోసుకొని మరీ ఇచ్చేది! ధారకుడు అంటే తిండిపెట్టేవాడు.  మనం సరిగ్గా చెప్పినపనులు చేస్తూ ఉంటే మన యజమానే మన మంచిచెడ్డలు చూసి తిండికీ గుడ్డకూ లోపం రాకుండా యేలుకుంటాడు. లేదా పస్తులే. చెల్లని నాణానికి మారకంగా ఏదీ కొనుగోలు చేయలేం కాని మంచినాణానికి దుకాణంలో తిండి దొరుకుతుంది కదా! అంటే ఇక్కడ, తాను సరిగా ప్రభువు (శ్రీవేంకటేశ్వరుడు) చెప్పిన పనులు చక్కగా చేసే వాడినే కాని డాబుకొట్టే చెల్లని నాణెం వంటి వాడను కాననీ, ఆ ప్రభువే తనని రక్షించుతూ తిండితిప్పలకు లోపం రాకుండా చూసుకుంటూ ఉంటాడనీ అంటున్నారు. అందుచేత తనకి ఏవిచారమూ ఏచింతా లేదట.

తనకు మంచి చనువే  ఉంటే రాజుగారి దగ్గర ఆశ్రయానికి లోపం ఎందుకు వస్తుంది? తాను చెప్పినట్లుగా రాజే తప్పకుండా చేస్తాడు మైత్రిని పాటించి. అంతే కదా. ఊళ్ళో వాళ్ళ పశువులు దారితప్పి ఇతరుల చేలలో పొరపాటున మేస్తే వాటిని బందెల దొడ్లో పెడతారు అధికారులు. కాని ఆ పశువులు కాని రాచవాళ్ళవి ఐనప్పుడు అంత సాహసం చేస్తారా అదే అధికారులు? అంత సాహసమా వాళ్ళకి? అంటే ఇక్కడ తాను ప్రభువైన శ్రీవేంకటేశ్వరుడి సొత్తును అనీ తనకు కల ఈగుర్తింపు ఆధారంగా తనని ఎవ్వరూ ఏమీ చేయలేరనీ అంటున్నారు! అధికారులు సామాన్యులను సాధించదలచుకుంటే అది సులువే కావచ్చు కాని రాజాశ్రయం కలవారిని సాధించాలంటే వశమా! రాజే తన మాట విని అడిగింది చేస్తాడు కదా, అటువంటప్పుడు తన జోలికి అధికారులు రాలేరు కదా అని అంటున్నారు.

ఈ కీర్తనలో కొన్ని విశేషాలు చూదాం. మారుముద్ర అన్న మాటను బట్టి దొంగనాణాల బెడద అప్పట్లో కూడా ఉండేది అన్నమాట విశదం అవుతోంది. అధికారులు సామాన్యులను వేధిస్తూ రాజాశ్రయం కలవారి పట్ల భయభక్తులతో ఉండటం అనే లోకరీతి విదితం అవుతోంది. బుధ్ధి ఉన్నవాళ్ళు తప్పులు చేయరనీ పాపమే భయహేతువు అనీ నిష్కర్ష చేయటమూ ఇందులో చూస్తున్నాం.