నిదురించుటకు ముందు నీలమేఘశ్యామ నిను
మదినెన్ని ముదమార నిదురింతు నోయి
నేడు నాదు పెదవులు నీ దివ్యనామంబును
వేడుకగా పాడుటలో విఫలమైన వేమో జూడ నది పెనుదోషము సుప్రసాద శ్రీరామ
వేడెద మన్నింపు మనుచు విన్నపములుచేయుచు
వదలలేక వదలలేక వదలి నీనామంబును
పెదవులు నీ సెలవడిగి విశ్రమించే నిదే
నిదురించుచుంటి ప్రభూ నీవు నాకు కలలోన
సదయా కనుపించు మనుచు చక్కగా వేడుకొనుచు
కలదో యొక రే పన్నది కన నిది తుదిసారియో
జలజాప్తకులభూషణ తెలియదు రామయ్య
తెలిసిన నీయండ చక్కగ కలదని నాకెప్పుడును
తలచి నీతలపులనే తలను నించి యుందు నని