ఆదినమే కడు దుర్దినము కదా అట్టిది రానీ కయ్యా
బహుదుర్దినములు గడచినపిదప వచ్చెను నీపై మనసే
యిహసౌఖ్యంబులు మృషలని తెలిసితి నిక నిను విడువను రామా
అహరహమును నీకర్పించుటకే తహతహ పుట్టెను లోలో
మిహిరకులైకవిభూషణ నాకొక మేలొన గూర్చుము దేవా
మనసున నీశుభనామము తలచుచు మరిమరి తలచుచు మురిసే
దినమే కాదా శుభదిన మనగా యినకులతిలకా నాకు
దినదినమును మరి శుభదిన మగుచు తీయగసాగే వరమే
కనికరించరా మునిజనవినుతా కమలదళాక్షా రామా
భవతారకమను ప్రఖ్యాతిగల పావనమగు నీనామం
బవగుణములతో నల్లల్లాడెడు నర్భకమగు చిత్తములో
రవళించగ జేయగదే దయతో రామా నీదయ లేదా
వివిధంబులగు కలిమాయలకు విచ్చిపోవురా దేవా