8, నవంబర్ 2022, మంగళవారం

రామపాదము సోకెను ఒక రాయి రమణిగ మారెను



 
రామపాదము సోకెను ఒక రాయి రమణిగ మారెను
రామనామము పలికెనా ఆ రాయిలోగల మానసం

రాయిగా అటులుండెనా ఒక రమణి వేల యేండ్లుగా
రాయిగా ఒక రమణిని అటు చేయ నేర్చిన దెవ్వరో
ఆ యుదంతము నంతయును బ్రహ్మర్షి తెలిసియె తెచ్చెనా
ఈ యమోఘపాదపద్ముని ఈమహాత్ముని రాముని
 
ఏమి మౌని చంద్రమా యిదియేమి చిత్రము తెలుపుమా
రామపాదము సోకుటేమిటి రాయి రమణిగ మారుటేమిటి
ఈమె రూపమునన్ తపస్విని ఈమె తేజమునన్ యశస్విని
ఈమె రాయిగ నుండుటే మని యినకులేశుడు వగచెను

మౌని విశ్వామిత్రు డంతట మందహాసము చేసెను
చాన ఈమె అహల్య గౌతమమౌని సాధ్వి రఘూత్తమా
మౌని తొందరపడుట వలన మానిని శిలయైనది
మేన నీపదస్పర్శ సోకి మేలుజరిగె ననె ముని


 
( ఈ టపాలో ఇచ్చిన చిత్రం వికీపీడియా లోనిది.  )