విన్నారా గోపాలుని వేణుగానము వీను
లున్నందుల కది వినుటే యుత్తమఫలము
ఈపొదలో నున్నాడో ఆపొదలో నున్నాడో
యేపొదలో నున్నాడో యెవ్వరి కెఱుక
ఈపొద లెందేని లేడొ యీపొద లన్నిటను కలడొ
గోపాలుని కొఱకు వెదకు గోపికలారా
తాపోపశమనకరము కోపోపశమనకరము
పాపసంహారకరము పడతుక లారా
ఆపాట వినుట చాలు గోపాలుడు గుండెలలో
గూడుకట్టికొని లేడో గోపికలారా
వెలి నుండును లో నుండును విశ్వమయుడై యుండును
కులుకుచు నీ బృందావనము నలుదిక్కులను
కలయదిరుగుచుండు గోపికలకు దొరకుచుండు మఱియు
విలాసముగ దాగి యిటుల వేణువూదును