నీకు మ్రొక్కేమురా గోకుల బాలా
మాకు తనివితీరలేదు మరల నూదరా
ముధ్దుముధ్దు మాటల మోహనకృష్ణా ఇంక
సధ్దుచేయము లేరా చాలనకురా
పొద్దుపోయిన దింక పొండన బోకు మాకు
సుధ్దులేమి బోధింపజూడకు కృష్ణా
ఒక చిన్న పాటపాడి ఉవిదలారా నేటికి
యికచాలు ననరాదు ఎట్లుచాలురా
ఒకటి రెండు ఝాములైన యొప్పిదమేరా మాకు
వికచాబ్జనయన కృష్ణ వినిపించుమురా
మురళిపాట వినుటకే పుట్టినామురా కృష్ణ
మరలమరల వినకుండ మరలగ లేము
పరమమధురమైన మురళిపాటకన్న మాకేదీ
ధరణిమీద హితము కాదయ్యా బ్రతుకున