అంతే నయ్యా హరి యంతే నయ్యా యిది
యంతయు నీయిఛ్ఛయే యందు నయ్యా
ధరణి సుజను లెల్ల నిను దైవరాయడా
కరము పొగడుచుండ వినుచు మురియుదు నయ్యా
నిరంతరము నీనామము నెమ్మది నెంచి
పరమసంతోషముగను పలుకుదు నయ్యా
రామ రామ రామ యనుచు రసన పాడగా
భూమిజారమణ చాల పొంగుదు నయ్యా
నీమహామధురదివ్య నామము నించి
రామచంద్ర సంకీర్తన లల్లితి నయ్యా
నేను నీవాడ నగచు నిలచితి నయ్యా
మానక నామీద దయ రానీ వయ్యా
నే నెన్ని జన్భ లెత్తినానో స్వామీ
దానికేమి యిదే కడది కానీ వయ్యా