రసనా ఈ శ్రీరామనామమే రసరమ్యము కాదా
వాసిగ మోక్షప్రదాయక మగుచు భాసించును కాదా
ప్రీతిగ పలుకుచు నుండిన సర్వాభీష్టము లిచ్చు గదా
చేతోమోదము గూర్చుచు భక్తుల చింతలుడుపు గాదా
సీతారాముల దయామృతమునే చిలికించును కాదా
భూతలవాసుల కంతకు మించిన భూరిభాగ్య మేదే
వీరిని వారిని పొగడుచు నెందుకు వీఱిడి వయ్యెదవే
ఊరక సామాన్యులను పొగడిన నుపయోగము కలదా
నారాయణుని పొగడిన తలచిన నరుడు తరించేనే
శ్రీరామా యను శుభనామమునే ప్రీతిగ పాడగదే
తారకనామము కన్న తీయనిది ధరపై లేదు కదా
మారాడక శ్రీరామనామమే మానక పాడగదే
మారజనకుని వేయినామముల మధురమధుర మనుచు
పేరుకెక్కిన రామనామమును విడువక నుండగదే