ఈరోజున ఉపాధ్యాయదినోత్సవం అంటున్నారు. ఈరోజు భారతరాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి జన్మదినోత్సవం. ఆ సందర్భంగా ప్రతిసంవత్సరమూ ఈ సెప్టెంబరు 5వ తారీఖును జాతీయఉపాధ్యాయదినోత్సవంగా మనం వాడుక చేస్తున్నాం.
నిజానికి సంప్రదాయికంగా మనకు గురుపూర్ణిమ అనే వేరే గురుసంస్మరణోత్సవ దినం ఉంది. అది వేదవ్యాసమహర్షిని మనం గుర్తుచేసుకొని ఆరాధించటానికి సంబంధించినది.
ఈ రెండు ఒక్కలాంటివే అనిపించవచ్చును కాని వేరువేరు.
ఈరోజును భండారు శ్రీనివాసరావు గారు ముగ్గురు గురువులు అని ఒకటపా వ్రాసారు. మరికొంతమంది కూడా సందర్భానుసారం ఏమన్నా టపాలు వ్రాసారేమో. ఇంకా చూడలేదు.
నాకు మాస్వగ్రామం లక్ష్మీపోలవరంలో అక్షరాభ్యాసం జరిగింది. కొంచెం కోలాహలంగానే జరిగింది. ఇంటికి పెద్దపిల్లవాడిని కదా, ఆమాత్రం చేయరా ఏమి? మాగ్రామంలోని ప్రాథమికపాఠశాల మాయింటికి అక్షరాలా కూతవేటు దూరంలోనే ఉంది. అందుచేత ఆపాఠశాల ఉపాధ్యాయులూ విద్యార్ధులూ అందరూ వచ్చారు. బొందుపలకా బలపాల పెట్టే సిధ్ధంగా ఉన్నాయి. నాకు ఒక తెల్లచొక్కా పాంటు కుట్టించారు. అవి వేసి అక్షరాభ్యాసం చేయించారు. ఓనమాలు దిద్దించినది ఆపాఠశాల ప్రథానోపాధ్యాయులు. ఆయన పేరు నాకు తెలియదు. ఆయన్ను అందరూ మాస్టారూ, పోస్టుమాష్టారూ అనటమే మరి. పిల్లలందరకూ పప్పుబెల్లాలూ పలకలూ పంచాం. ఆరోజునుండి బడిచదువు ప్రారంభం అయింది.
ఆ పాఠశాలలో ముగ్గురే ఉపాధ్యాయులు. పోష్టుమాష్టారు గారే ప్రథానోపాధ్యాయులు. ఆయనకు పెద్ద బొట్టొకటి ఉండేది. భలే లావుపాటి పెన్నొకటి ఉండేది చొక్కా జేబులో. వాళ్ళబ్బాయి కూడా అదే పాఠశాలలో విద్యార్ధి.
రెండవ ఉపాధ్యాయులు ఆలీఖాన్ మాష్టారు. పొడుగ్గా సన్నగా కోలముఖంతో ఉండేవారు. తెలుగుభాష అంటే ప్రాణం ఆయనకు. మాకు దస్తూరీ నేర్పించేవారు ముఖ్యంగా. గణితం కూడా చెప్పేవారు.
మూడవ ఉపాధ్యాయులు కటాక్షమ్మ గారు. ఆవిడే ముఖ్యంగా నాకు చదువు చెప్పారు. అమ్మా ఆవు ఇల్లూ అంటూ మొదలుపెట్టి. సాయంత్రం పాఠశాల బయట చెట్టుక్రింద పిల్లల్ని కూర్చోబెట్టి చిట్టిపొట్టి కథలూ పాటలూ చెప్పేవారు.
నాకు కటాక్షమ్మ గారితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆవిడ మా ఊరికి రోజూ లాంచీ మీద ప్రయాణం చేసి వచ్చేవారు. ఆ పాఠశాల మాయింటికి చాలా సమీపంలోనే ఉండేది. రోజూ ఆవిడ మాయింటికి వచ్చి నన్ను కూడా పాఠశాలకు తీసుకొని వెళ్ళేవారు.
ఒకరోజున ఆవిడ ఎందుకో బడికి రాలేదు. అందుచేత నేనూ బడికి పోలేదు! మర్నాడు ఆవిడ వచ్చి నిన్న నువ్వెందుకు బడికి పోలేదూ అని అడిగింది. మరి నువ్వెందుకు రాలేదూ నాకోసం అని అడిగాను ప్రతిగా. ఆవిడకు నవ్వు వచ్చింది కాని మానాన్నగారికి చిరుకోవం వచ్చింది. అలా ఉపాధ్యాయులకు ఎదురు సమాధానం చెప్పకూడదని కొంచెం హితబోధ చేసారు. రేపటినుండి నీ అంతట నువ్వే బడికి వెళ్ళలి అని చెప్పారు కూడా.
ఐనా ఆవిడ వస్తూనే ఉండే వారు లెండి నాకోసం. నన్ను బాగా ముద్దు చేసే వారు.
అంత ముద్దుచేసినా ఒక సారి పిచిక అనే పాఠం అప్పచెప్పలేకపోయానని బాగా కోప్పడ్డారు. కోపం నాకు మాత్రం రాదా ఏమిటీ? నేనూ కోపంగా పాఠశాల పిట్టగోడ దూకి రెండంగల్లో ఇంటికి పోయానంతే. పాపం ఆవిడ మాయింటికి వచ్చి ఎంతోసేపు బ్రతిమలాడి మళ్ళీ పాఠశాలకు తీసుకొని వెళ్ళారు ఆరోజున.
అవిడ చెప్పిన కథలూ పాటలూ అన్నీ రోజూ సాయంత్రం ఇంటికి వచ్చాకా మాఅమ్మగారికి చెప్తూ ఉండేవాడిని. ఆపాటలైతే డాన్సు చేస్తూనే చెప్పటం. అందులో ఒకపాట "అమ్మ చెప్పిన్ మాట వినకపోతే నీవును - అలాగె కష్టపడవలెన్" అని ఉండేది.
నేను పెరిగి పెద్దై ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడిన తరువాత కూడా మాస్వగ్రామానికి వెళ్తూనే ఉండే వాడిని. నేను ఊళ్ళోకి వచ్చాన్నన్న వార్త కటాక్షమ్మ గారికి ఎలా తెలిసేదో తెలిసేది. వెంటనే, అప్పటికే వృధ్ధురాలైన అవిడ లాంచీ ఎక్కి గోపాలపురం నుండి లక్ష్మీపోలవరంలోని మాయింటికి వచ్చే వారు నన్ను చూడటానికి.
ఆవిడను నేను ఎన్నడూ 'మీరు' అని పిలిచింది లేదు - ఎప్పుడూ 'నువ్వూ' అనే. చిన్నప్పుడు బాగానే ఉంటుంది కాని పెద్దవాడిని అయ్యాక కూడా అలాగే పిలిచే వాడిని. ఆవిడా ఏమీ అనుకునేది కాదు. కాని ఒక సారి మాత్రం "నేను నీకు గురువును కదా. నన్ను నువ్వూ అని పిలవచ్చా" అంది. "నాకు మా అమ్మ ఎంతో నువ్వంత. ఎవరన్నా అమ్మని మీరూ అంటారా" అని చెప్పాను. ఆవిడకు ఎంతో సంతోషం కలిగింది.
మొదట్లోనే పలకా బలపం అనుకోకండి. నేను ఐదో తరగతిలో కూడా పలక బలపం వాడాను. అప్పట్లో అంతే. రెండో తరగతిలో నాచేతికి పెన్సిల్ వచ్చింది కాని ఎక్కువభాగం బలపంతోనే చదువు. డబుల్ రూళ్ళ పుస్తకంలో ఆలీఖాన్ మాష్టారు మాకు చూచివ్రాత నేర్పేవారు. ఆయనకు తెలుగు అంటే ప్రాణం. మేం అక్షరాలు వంకరటింకరగా గిలికితే ఆయన గిలగిల్లాడేవారు. ఒరే తెలుగు అక్షరాలు ముత్యాల్లా ఉంటాయిరా. ఇంత అందమైన అక్షరాలు మరే భాషలోనూ లేవురా. చక్కగా గుండ్రంగా వ్రాయాలిరా అని బుజ్జగిస్తూ ఉండే వారు మమ్మల్ని.కాని అ గుండ్రంగా వ్రాయటం మాకు ఒకపట్టాన కుదిరేది కాదు.
ఒక సారిమాత్రం నేను చాలా చక్కగా ఆయన పేజీ మొదట్లో వ్రాసిన లైనులో ఉన్నంత గుండ్రంగానూ అందంగానూ చూచివ్రాత వ్రాసాను. నాకే పిచ్చి ఆనందం కలిగింది. వెంటనే ఆలీఖాన్ మాష్టారి ఇంటికి పరుగెత్తాను. ఆయ నుండే ఇల్లు మావీధి చివర్లోనే ఉండేది లెండి. వెళ్ళి ఆయన మీద పడ్డాను చూడండి ఎంత గుండ్రంగా రాసానో గుడ్ అని చెప్పండి అని హడావుడి చేసాను. ఓరేయ్ నేను ఇప్పుడు అన్నం తింటున్నాన్రా. తిన్నాక చూస్తాను సరేనా అంటే వింటేనా? చూడండి ఎంత గుండ్రంగా రాసానో అని గోల, చివరకు ఆయన కుడిచేయి అంటచేయి కాబట్టి ఎడం చేత్తోనే పుస్తంకం అందుకొని చూసి బాగుంద్రా అంటే మరి గుడ్ అని రాయండి అని నా డిమాండ్.
ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి కొడుకు కూడా మాతో చదువుకున్నాడని చెప్పాను కదా. మేము పెద్ద ఐన తరువాత కూడా కొన్ని సార్లు మాఊళ్ళో కలుసుకున్నాం. అప్పుడు పెద్దాయనను ఒకసారి కలుసుకున్నానని గుర్తు.
మాఊరి బడిలో నేను చదివింది మూడోతరగతి వరకే. అదీ మధ్యలో ఉండగా గెద్దనాపల్లె వెళ్ళిపోయాం. అక్కడ మానాన్నగారు మాధ్యమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉండే వారన్న మాట.నేను గెద్దనాపల్లెలో మూడు నుండి ఐదుకు జంప్ చేసాను. అప్పట్లో ఉపాధ్యాయులు తమకు నమ్మకం కుదిరితే అలా ప్రమోట్ చేసేవారన్న మాట. ఆ బళ్ళో నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు సోమరాజు మాష్టారు. ఆబళ్ళో కొద్దికాలమే చదివి మానాన్నగారి ఆధ్వర్యంలోని మిడిల్ స్కూల్లో ఆరులో చేరాను.
కాని ఆ సోమరాజు మాష్టారు గారిని నేను అమలాపురంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా ఒకటి రెండు సార్లు కలిసాను. ఆయన నేను ఆద్దెకు ఉంటున్న రూము యజమాని గారికి బంధువు కావటం కారణం. ఆయనా నన్ను కలిసినందుకు చాలా సంతోషించారు.