కొలువు తీరి నావు బలే గొప్పగాను లోక
ముల నేలు రామచంద్రమూర్తి నీవు
వైకుంఠపుర మందు బహువిలాసము గాను
శ్రీకాంతతో శేషసింహాసనము పైన
లోకేశుల వినతులు సాకల్యముగ వినుచు
ప్రాకటముగ శ్రీహరివై వెలుగొందుచును
సాకేత పురమందు జానకీసతి గూడి
శ్రీకరుడవై రత్నసింహాసనము పైన
లోకస్థులు మునివరులు నీకు స్తోత్రము చేయ
రాకేందువదన శ్రీరాముడవై వెలుగుచును
భక్తహృదయపురమున పరమానందముతో
యుక్తభావనార్పిత ముచితాసనము పై నను
రక్తితో కూర్చుండు రామబ్రహ్మంబువై
ముక్తిప్రదుడ వగుచు ముచ్చటగ వెలుగుచును