రాలుగాయి మనసా రాలుగాయి మనసా రాముని కొలువవే మనసా
చాలు నీవేషాలు శ్రీరామచంద్రుని చక్కగ కొలువవే మనసా
వేరువారల గొల్చి వెఱ్ఱివి కాబోక విభుని వేడవె నీవు మనసా
కారుణ్యాంబుధియైన శ్రీరామచంద్రుని ఘనముగ కొలువవే మనసా
ఘోరసంసారపు తీరంబుజేర్చెడి ఘననౌక రాముడే మనసా
తారకరాముని కొలిచెడు వారలె ధన్యులీ జగతిని మనసా
మారజనకుని శ్రీమన్నారాయణుని నీవు మరిమరి వేడవె మనసా
మారవైరియుకూడ రామనామము యొక్క మహిమచాటుచు నుండు మనసా
నారదాదులు మునిముఖ్యులు సేవించు నారాయణుని నీవు మనసా
చేరి సదా చిత్తశుధ్ధితో కొలిచినచో చేకూరునే ముక్తి మనసా
తప్పుడు గురువుల బోధలు వినినీవు తప్పుదారుల బోక మనసా
ఒప్పుగ శ్రీరామపాదాలు సేవింప నుత్సహించవె నీవు మపసా
తప్పక శ్రధ్ధతో శ్రీరామనామము తలదాల్చియుండవే మనసా
ఎప్పటికైనను శ్రీరామచంద్రుడే యిచ్చునే మోక్షమును మనసా