ధీమంతులగు మీకు తెలిసియుండగ వచ్చు
నేమంత్రమో యది యెఱిగించుడీ మాకు
కామితార్ధములెల్ల ప్రేమతో నందించు ఘనమైన మంత్ర మదేదందురు
నీమమొప్పగ జేయ మిముగాచి మోక్షంబునే యిచ్చు మంత్ర మదేదందురు
పామరులకు గూడ పలికినంతనె గొప్పఫలమిచ్చు మంత్ర మదేదందురు
ఏమందు మేమందు మది రామచంద్రుని యింపైన తారకమంత్రము
జడునైన తులలేని పండితునిగ జేయు చక్కన్ని మంత్రంబు నేమందురు
పడియున్న శిలనైన భామినీమణిజేయు కడుగొప్ప మంత్రంబు నేమందురు
కడకు రక్కసునైన ఘనభాగవతుజేయు ఘనమైన ముత్రంబు నేమందురు
పుడమిపై భవతారకంబన్న ప్రఖ్యాతి బడసిన శ్రీరామమంత్రము
పరమయోగివరులు భావించుచుండెడి పరమదివ్యమంత్ర మేదందురు
పరమభక్తులెపుడు పఠియించుచుచుండెడి పరమదివ్యమంత్ర మేదందురు
పరమశివుడు తాను జపియించుచుండెడి పరమదివ్యమంత్ర మేదందురు
మరియేమి మంత్రము శ్రీరామచంద్రుని మంత్రము తారకమంత్రము