ఎంత చిత్రమైన జీవు లీమానవులు తా
మెంత భ్రాంతిలోన బ్రతుకు లీడ్చుచుందురు
ధర్మ మనుష్ఠేయమని తామెఱుగుదురు కాని
ధర్మపరులైనవారు ధర నెందరు
ధనము వెంటరాదని తామెఱుగుదురు కాని
ధనపిశాచములవోలె తాముందురు
తనువు లివి బుడగలని తామెఱుగుదురు కాని
తనువులపై మోహమును తాము వీడరు
కామాదులు శత్రువులని తామెఱుగుదురు కాని
కామక్రోధముల విడువగా నేరరు
దారాదులు బంధములని తామెఱుగుదురు కాని
వారే సర్వస్వమనుచు పలుకుచుందురు
రాముడే దేవుడనుచు తామెఱుగుదురు కాని
రామనామ మెందరికి రసన నుండును
తారక మా నామమని తామెఱుగుదురు కాని
శ్రీరామా యన నెంతో సిగ్గుపడుదురు