సందియమెందుకె మనసా శ్రీరఘునందను జేరవే
అందరి వాడా రాముడు మనసా ఆశ్రయించవే
కారుణ్యాలయు డాతడు మెచ్చిన కలుగును మోక్షము మనసా
ధరపై రామున కన్యదైవమును తలపగరాదే మనసా
పరమాత్ముడు శ్రీరామచంద్రుడని మరువగరాదే మనసా
సర్వవేళలను సాకేతపురసార్వభౌమునే మనసా
సర్వవిధములుగ సేవించుటయే చాలమంచిదో మనసా
సర్వము రామమమయంబని యెఱిగిన శాంతి కలుగునే మనసా
గర్వాదికములు తాపత్రయములు కనుమరుగగునే మనసా
మున్ను సుజను లీభక్తిమార్గమున పోయితరించిరి మనసా
తన్ను నమ్మినవారికి దశరథతనయుడు సులభుడు మనసా
వెన్నవంటిదా రాముని హృదయము వేడి తరించవె మనసా
కన్నతండ్రి రఘురాము డెన్నడును కాదనబోడే మనసా