మానవాధిపేంద్రు డడిగో కానవచ్ఛేను
ముందట బెత్తాలవారదె మోదముతో నడచుచుండ
చందురునకు మించి చాలా చక్కనివాడు
వందారుసద్భక్తమందారుడైన దేవుం
డందరివాడు రాము డల్లదే కనుడీ
సంద్రమునే కట్టి సమరంబున దాన
వేంద్రునే పట్టి చాలవిధములుగ గొట్టి
యింద్రాదు లరయ జంపి యినకులేశుడు మాన
వేంద్రుం డైనట్టి రాముడు వేంచేసె కనుడీ
మ్రొక్కరే రావణుని పీడ తుక్కుచేసిన పతికి
మ్రొక్కరే దేవతలు మున్నే మ్రొక్కి రితడికి
మ్రొక్కరే మన నేలవచ్చిన మూడులోకముల నేలు
చక్కనయ్యకు స్వామి వచ్చిన చల్లనివేళ