సీతారాముడు మన సీతారాముడు
చల్లగ సురలను కాచెడి వాడు
చల్లని వెన్నెల నగవుల వాడు
జల్లుగ కరుణను కురిసెడి వాడు
కొల్లగ శుభముల నిఛ్చెడి వాడు
నల్లని మేఘము బోలెడు వాడు
చిల్లర మాయల చెండెడు వాడు
అల్లరి దైత్యుల నణచెడు వాడు
చల్లగ భక్తుల నేలెడు వాడు
మూడు లోకముల నేలెడు వాడు
చూడగ చక్కని రూపము వాడు
వేడుక గొలిపే నడవడి వాడు
ఆడిన మాటను తప్పని వాడు
తోడుగ నీడగ నిలచెడి వాడు
వేడక వరముల నొసగెడి వాడు
వేడుక భక్తుల బ్రోచెడి వాడు
వేడిన మోక్షము నిచ్చెడు వాడు
శరముల సంగతి నెఱిగిన వాడు
గురికి తప్పని బాణము వాడు
సురవిరోధులను చీల్చెడు వాడు
పరమాత్ముడు శ్రీహరియే వాడు