ఇతడే శ్రీరాముడై యినకులాబ్ధి సోముడై
మానిత శోభలను వెలుగు మన విష్ణుదేవుడు
వైకుంఠపురధాముడు పరంధాము డితడే
లోకస్థితికారకుడగు శ్రీకాంతు డితడే
తేకువ దైత్యాళి బట్టి తెగవేయు నీతడే
శ్రీకరుడై భక్తాళికి చింతలణచు నీతడే
సోమకుని హిరణ్యాక్షుని హేమకశిపుని
కాముకు రావణుని పాడు కంస శిశుపాలుర
ధీమంతుడై దక్షిణ దిక్కుపట్టించెను
తామస రహితులకు దిక్కు తానాయె నితడే
చేతోమోదమును గలిగి శ్రీరామ రాఘవేంద్ర
సీతారామ అనగానే చింతలన్ని బాపుచు
ప్రీతితోడ మంచివారి విడువకుండు నితడే
రాతిరి యగు పవలగు రక్షించు నీతడే