ఈమందిర మిది నీదే యిందు విశ్రమించుము
రామా సలక్ష్మణముగ రామామణి సీతతో
హనుమన్న ననుమతింతు మన భరతు ననుమతింతు
జననుతుల శత్రుఘ్న విభీషణుల ననుమతింతు
అనుమతించబో నన్యుల హాయిగా విశ్రమించు
మనఘ రామచంద్ర నామనోమందిరమున
సాకేతమునకే కాదు సకలబ్రహ్మాండములకు
శ్రీకరుడవు పోషకుడవు శ్రీరామచంద్ర
నీకొకింత విశ్రాంతియు లేక బడలుచున్నావే
నీకు విశ్రాంతి నిచ్చి.నేకావలి యుందును
పొద్దుపొయినా వదలక పూజలుచేయను నేను
అద్దమరేతిరి సుప్రభాత మారంభించను నేను
సద్దుచేయక నేను బయట చక్కగ కావలుందును
వద్దువద్దనక నీవు వచ్చి విశ్రమించవే