18, నవంబర్ 2020, బుధవారం

నాగులచవితి


 


 

నాగులచవితి పాటను బసవరాజు అప్పారావు గారు రచించారు. ఇది కన్యాశుల్కం సినిమాలో ఉపయోగించుకున్నారు.


ఒక ఆసక్తి కరమైన ఐతిహ్యం చెప్తాను.

 తాతల నాటి కథ.  ఒక కుటుంబానికి కులదైవంగా నాగేంద్రుడు ఉన్నాడు. దంపతులు సంతానభాగ్యం కోసం పరితపిస్తున్న రోజుల్లో ఒకనాడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది.

ఎవరో వాకిట ముందుకు వచ్చి ఆనాటి ఉదయం "భవతీ భిక్షాం దేహి" అన్నాడు.

ఇంటి ఇల్లాలు ఇన్ని తండులాలు భిక్షతీసుకొని వచ్చి వేసింది.

ఆ బిచ్చగాడు చూడటానికి ఎవరో ఒక సాధువు గారిలా ఉన్నాడు కాషాయవస్త్రాల్లో. అయన భిక్షను స్వీకరించి ఇలా అన్నాడు. "అమ్మా సంతానభాగ్యం లేదని మీరిద్దరూ చాలా విచారంలో ఉన్నారు కదా, నిజమేనా?"

"అవును స్వామీ" అన్నది ఆ గృహిణి.

"మీ ఇలవేల్పు నాగేంద్రుడు. కొన్నాళ్ళుగా అయనకు సరిగా మీ‌యింట ఆదరణ లభించటం లేదు. అందుకే మీకు సంతానం ఆలస్యం అవుతున్నది" అన్నాడు సాధువు.

"అయ్యో అలాగా స్వామీ, ఇప్పుడు మాకు ఏదన్నా దారి చూపండి" అని అమె వేడుకొన్నది.

"భయపడకండి. మీరు కావాలని అలక్ష్యం చేయలేదు. ఇకనుండి శ్రధ్ధవహించండి. నాగుల చవితి వస్తోంది. మీరిద్దరూ‌ ఉపవాసం ఉండి నాగేంద్రుణ్ణి ప్రార్ధిచండి. మీకు శుభం‌ కలుగుతుంది." ఇలా ఊరడించి ఆ సాధువు వెళ్ళి పోయాడు.

నాగులచవితి వచ్చింది. దంపతులు నిష్టగా నాగేంద్రుణ్ణి ఆరాధించి వేదుకొన్నారు.

మరలా కొన్నాళ్ళకు ఆ సాధువు మరలా ఇంటి ముందుకు వచ్చాడు.

గృహిణీ ముఖం విప్పారింది. ఆనందంగా భిక్ష వేసింది.

సాధువు ఇలా అన్నాడు. "మీ‌యందు నాగేంద్రుడు ప్రసన్నుడై ఉన్నాడు."

గృహిణి సంతోషంతో సాధువుకు నమస్కారం చేసింది. అనందంతో ఆవిడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.

సాధువు "మరొక్క మాట అమ్మా. ఒకనాటి రాత్రి మీరు శయనించి ఉండగా నాగేంద్రుడు మీ‌పడకగదిలో ప్రత్యక్షం అవుతాడు. ఏమీ‌ భయపడకండి. మీరు నమస్కరించుకోండి. మీకంతా శుభం‌ కలుగుతుంది. మీ‌ పిల్లవాడికి నాగేంద్రుడి పేరు పెట్టుకోవాలి సుమా" అని చెప్పి వెళ్ళపోయాడు.

సాధువు గారు చెప్పినట్లే‌ జరిగింది. ఒకనాటి రాత్రి వారి శయనమందిరంలో ఆయన ఏకంగా దంపతులు యిద్దరి నడుమకు వచ్చి దర్శనం ఇచ్చాడు. 

 బుస వినిపించి. ఏదో‌ మెత్తటి స్పర్శ తగిలి ఇద్దరూ మేలుకాంచారు. మధ్యలో‌ పెద్ద పాము!

ఇద్దరూ‌ భయంతో క్రిందికి ఉరికారు. కరచరణాలు ఆడలేదు వారికి. మెల్లగా సాధువు చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నారు. భయం భయంగానే నమస్కారాలు చేసారు. ఆ నాగేంద్రుడు బయటకు వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళకు వారికి పుత్రసంతానం కలిగింది. ఆ పిల్లవాడికి సుబ్బారావు అని పేరు పెట్టుకున్నారు.

ఆసుబ్బారావు గారు మా పితామహులు.

ఆ నాటి నుండి మా యింటిలో నాగేంద్రుడు అప్పుడప్పుడు ప్రత్యక్షం కావటం వాడుకగా ఉన్నది.

 

*   *   *      *   *   *


ఒక వేసవి కాలం మధ్యాహ్నం. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. అదే‌ పడుకగది. మానాన్నగారు, అయన ప్రక్కన నేను పడుకొని నిదురపోతున్నాం భోజనానంతరం.

భోజనాలవసారాకు ఆ పడుకగది నుండి ఒక కిటికీ ఉంది. అక్కడ నిలబడి మా నాయనమ్మ గారు మెల్లగా పిలుస్తున్నారు మమ్మల్ని.

ముందు నాకు మెలకువ వచ్చింది. మా నాన్నగారిని లేపాను. మా బామ్మ గారు కిటికీ ఆవల నిలబడి "పామురా పాము" అంటూ చెప్తున్నారు.

పడుకగది తలుపులు తెరచి బయటకు వస్తున్నాం.

పడుకగది తలుపులు ఇంటి మధ్యన ఉన్న హాలులోనికి తెరచుకుంటాయి. ఆ హాలులో పైన పెద్ద అటక ఉంది. ఆ అటక ముఖగహ్వరం పడకది గుమ్మానికి ఎదురుగా పైకి ఉండి అక్కడి నుండి చక్కగా కనిపిస్తూ ఉంటుంది.

అటక మీద ముఖద్వారం దగ్గర ఒక నిట్రాటను చుట్టుకొని ఒక పెద్ద తెల్లని సర్పం మాకు దర్శనం ఇచ్చింది.

అందరం చాలా భయపడ్దాం.

చూస్తూ‌ ఉండగానే అది నిట్రాటను దిగి అటక లోపలికి వెళ్ళిపోయింది.

మానాన్నగారు పాములవాళ్ళని పిలిపించారు. వాళ్ళు మాయింటి పెరటి వైపున ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరనే ఉంటారు.  వాళ్ళు ధైర్యంగా అటక ఎక్కి గాలించారు. పాము జాడ లేదు.

అటక మీదికి కరెంటు వైర్లు పరిచి ప్రయత్నించారు. మళ్ళా మళ్ళా గాలించారు. 

అటక మీదనే‌ కాదు ఇల్లంతా బాగా గాలించారు, పెరడుతో‌ సహా.

మా నాన్నగారికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. లేకపోతే ఆయనకే తోచిందో. ఊళ్ళో ఎవరో మంత్రాలు వేసే అయన దగ్గరకు వెళ్ళి మంత్రించిన మినుములు తెచ్చారు. వారిచ్చిన సలహా మేరకు ఆ మినుముల్ని ఇంట్లో అన్ని చోట్లా చల్లాం. ఇంటి బయట పెరట్లోనూ‌ సందులోనూ‌ కూడా చల్లాం. ఇంటి సింహద్వారం ముందూ, పెరటి గుమ్మం దగ్గరా కూడా చల్లాం.

ఐనా మాకు భయంభయం‌ గానే ఉంది.

రాత్రి భోజనాలు కానిచ్చి నిదురపోతున్నాం. అర్ధరాత్రి ఏవో‌ ఘాటు సువాసనలతో‌ మెలకువ వచ్చింది అందరికీ. నిజానికి ఎవరమూ ఆదమరచి నిద్రపోవటం లేదు.

కాసేపు మల్లెపూవుల సువాసన వచ్చింది.

ఆతరువాత మొగలి పూవుల వాసన.

కొద్ది సేపటి మరొక సువాసన.

ఈ వాసనలన్నీ‌ దగ్గరలో ఉన్నట్లే వస్తున్నాయి.

లైట్లన్నీ వేసాం. అప్పటికి ఒకటి రెండు సంవత్సరాల క్రిందటనే‌ ఇంటికి కరెంటు కనెక్షన్ పెట్టించాం.

మా వీధిలో మొత్తం మూడు ఇళ్ళు. అంతే. మాది మధ్యలోని. అటూ ఇటూ‌ఉన్న ఇళ్ళూ మా జ్ఞాతులవే. కుడిప్రక్క ఇంట్లో ఉండే గోపాలం నాకు అన్నయ్య అవుతాడు. అతనూ మరి కొందరూ కర్రలు వేసుకొని వచ్చారు. ఇల్లంతా గాలించారు. పెరట్లో ఒక ఇటుకల దిబ్బ ఉంది. పాము అందులో కాని దూరిందేమో అని వాళ్ళు అనుమానించారు.

ఎలాగో రాత్రి గడిచింది.

ఉదయం మానాన్న గారు మళ్ళా ఆ మంత్రాలు వేసే ఆయనదగ్గరకు వెళ్ళారు.

అక్కడి నుండి తిరిగి వచ్చి మా నాన్నగారు అన్నమాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. "నాగేంద్రుడు మన కులదైవం. మనం‌ ఇలా ఆయన్ను తరిమేయాలని మంత్రాలూ వగైరా వేయించటం అపచారం. మనని నాగేంద్రుడు ఏమీ చేయడని దణ్ణం పెటుకుంటే చాలని చెప్పారు."

ఆ రోజున అందరం దణ్ణాలు పెట్టుకున్నాం. మా బామ్మ గారూ, మా అమ్మగారు ఉపవాసం ఉండి పూజ చేసుకున్నారు. 

ఇంక ఆరాత్రి ఏమీ వాసనలు రాలేదు.

 

*   *   *      *   *   *

 

మా యింట్లో అనే‌ కాదు మా తాతమ్మ గారి ఇంట్లో‌ కూడా నాగేంద్రుడిని చాలా నిష్టగా పూజించటం అనే అనవాయితీ ఉంది. మా తాతమ్మగారు నాగులచవితి నాడు చాలాచాలా నిష్టగా ఉండే వారు.

ఒక సారి పెద్దతనం వలన ఆవిడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారని అందరూ బలవంతం చేసి ఏ పాలో తాగించారట. అంతే. కొద్ది సేపటికి ఆవిడకు ఒళ్ళంతా బొబ్బలు వచ్చి గందరగోళం అయ్యిందట. ఆవిడ నాగేంద్రుడికి మొక్కుకుంటే ఆ బొబ్బలూ అవీ వెంటనే తగ్గిపోయాయట. నేనిలా 'అట' అంటూ‌ చెబుతున్నాను కాని ఈ‌సంఘటన మా అమ్మగారి ప్రత్యక్షంలోనే‌ జరిగిందని మా అమ్మగారే నాకు చెప్పారు. మా తాతమ్మ గారు మహాతెల్లగా మిసమిసలాడుతూ‌ఉండే వారు పండుముదుసలి ఐనా - అటువంటి వళ్ళంతా బొబ్బలతో ఎరుపెక్కి పోయిందని మా అమ్మగారు అన్నారు. మా తాతమ్మ గారంటే మా అమ్మగారికి చాలా ఆరాధనాభావం ఉండేది.

 

*   *   *      *   *   *

 

మా నాన్న గారు ఉపాధ్యాయులు కాబట్టి మేం‌ మా ఊళ్ళో ఉన్నది తక్కువ ఊళ్ళు తిరిగింది చాలా ఎక్కువ. అప్పుడప్పుడు సకుటుంబంగా స్వంత ఊరికి వచ్చి కొద్దిరోజులు ఉండి వెళ్తూ ఉండే వారం.  మా బామ్మగారు మాత్రం తరచూ మా స్వంత ఇంట్ళోనే దీర్ఘకాలం మకాం వేసి ఉండే వారు.

అలా ఒకసారి స్వంత ఊరికి వచ్చిన మా బామ్మగారు పడకగది అడివిలాగా ఉందని సర్దుతూ ఉంటే పెట్టెలో నాగేంద్రుడు. యధాలాపంగా పైకి తీసి పట్టుకున్నాక తెలిసి కెవ్వున అరిచి బయటకు పరిగెత్తారు.

మళ్ళా మా గోపాలం జనంతో వచ్చి వెతికించాడు కాని ఆ నాగేంద్రుడు జాడ లేదు.

మరొక సందర్భంలో ఇలా సకుటుంబంగా మేము సెలవులకు స్వంత ఊరికి వచ్చి ఉన్న రోజుల్లో మా అమ్మగారు పెరట్లో పని చూసుకొని భోజనాల వసారాలోనికి వచ్చి అనుమానం కలిగి వెనుదిరిగి చూసారు. ఆవిడ దాటి వచ్చింది గుమ్మాన్నే‌ కాదు గడపమీద పరచుకొని ఉన్న నాగేంద్రుణ్ణి కూడా.

ఏముంది, యధా ప్రకారం నలుగురూ చేరి వెదికితే‌ నాగేంద్రుడు పత్తాలేడు. ఎప్పుడో‌ జారుకున్నాడు.

ఇలాంటి సంఘటనలు మరొకొన్ని జరిగాయి.

మా అమ్మగారు ఒకసారి అన్నారు. "నాగేంద్రుడు కూడా మనింట్లో ఒకళ్ళా తిరుగుతున్నాడేమో" అని.

 

*   *   *      *   *   *

 

మా సోదరసోదరీమణుల్లో ఒకమ్మాయి పేరులోనూ ఒకబ్బాయి పేరులోనూ‌ నాగేంద్రుడి పేరును కలుపుకున్నాం. ఆ అమ్మాయి పేరు సూర్యసుబ్బలక్ష్మి, ఆ అబ్బాయి పేరు వేంకట సుబ్రహ్మణ్య వేణు గోపాలకృష్ణ.

మాలో‌ ఆఖరున పుట్టిన వాడికి సత్యప్రకాశ్ అని మా నాన్నగారి పేరు పెట్టుకున్నాం. సత్యప్రకాశ్ తన కుమారుడికి కార్తికేయ అని పేరు పెట్టి నాగేంద్రుడి పేరు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాడు.

 

*   *   *      *   *   *

 

ఇప్పుడు ఆ యిల్లు లేదు.

నాగేంద్రుడి దర్శనం కూడా లేదు.

మా కుటుంబంలో ఇప్పటికీ నాగేంద్రుడి పట్ల భక్తి ప్రపత్తులు మాత్రం అలాగే ఉన్నాయి.