ఎన్నడో నాస్వామి సన్నిథి కేనేగుట
యెన్నడో రాము డొక్కింత కృపజూపుట
పన్నుగ నాస్వామి కొరకు పాడగ నేనిచ్చట
నున్నానే కాని యిల నుండగ నాకేల
నిన్ను మెచ్చితి నని నన్ను నారాముడు
సన్న చేసి పిలుచుట జరిగేది యెన్నడో
ఉచితములై యొప్పారుచు నుండు నాపాటల
రుచిమరిగిన రాముడే యుచితమని తలచి
అచట పాడినది చాలు నలసినదా దేహమే
ఇచటనే యుండి పాడు మిక మీదట ననుట
పాటలా యవి నాకు పరమమంత్రము లందు
మాటలన్నియును వాని మహిమనే చాటునవి
నేటికో రేపటికో వాటికి మెచ్చి తన
వీటికి కిరమ్మని హరి పిలుచునో నన్ను