15, మే 2020, శుక్రవారం

రామనామ మది యమృతమే యని


రామనామ మది యమృతమే యని నీమనసునకు తోచినదా

రాముడు శ్రీమన్నారాయణు డని నీమనసునకు తోచినదా



పడిపడి బహుపుస్తకముల జదివిన ఫలము లేదని తెలిసినదా

గుడిగుడిలో గల రామచంద్రుడే గుండెల నుండుట తెలిసినదా

వడివడిగా భగవంతుని వైపుకు నడచుట మేలని తెలిసినదా

అడుగడుగున శ్రీరామచంద్రునే యఱయుట మేలని తెలిసినదా



తెలియవలసినది తెలిసిన పిమ్మట తెలివిడి చక్కగ కలిగినదా

కలిగిన తెలివిడి ఫలితముగా హరి కలడన్నిట యని తెలిసినదా

తెలిసితివా యీవిశ్వము శ్రీహరి దివ్యవిభూతిశతాంశముగ

తెలిసితివా శ్రీహరియే రాముని దివ్యాకృతియని చక్కగను



రామనామమే తారకనామము భూమిని పుట్టిన జీవులకు

రామరామ శ్రీరామరామ యని రామనామపు రుచితెలిసి

యేమనుజుడు ముక్కాలంబుల నెంచి పాడునో వాడు కదా

పామరత్వమును విడచి చేరును రాముని సన్నిధి తప్పకను