12, మే 2019, ఆదివారం
అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి
అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి మమ్మా మా
యమ్మా నీ చరణయుగళి నంటి మ్రొక్కేము
ప్రశమితాఖిలదనుజబలుడైన రాముని
యశమునకు మూలమో యమ్మా నీవే
దశరథుని కోడలా దశకంఠనాశినీ
కుశలవజనయిత్రి నీకు కోటిదండాలు
యింటి కావలివాడే యిలను రాకాసియై
యుంట నీవు కనుగొని యెంతోదయతో
తుంటరియగు వాని యింట దూరినావు
బంటుదిగులు తీర్చితివి బంగరు తల్లి
హరిబంటుల మగు మేము నజ్ఞానము చేత
ధరమీద నరులమై తిరుగాడు చున్నాము
పరమదయామయయీ మా బాధతీర్చవమ్మ
మరల హరిసన్నిథికి మమ్ము చేర్చవే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)