18, మార్చి 2019, సోమవారం
చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ
చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ నీకు
చేతకాని దేమున్నది సీతారామ
కాకి మీద దర్భవిసిరి సీతారామ నీవు
లోకములు త్రిప్పితివి సీతారామ
కాకివలె భీతుడనై సీతారామ నేను
లోకములు తిరుగుచుంటి సీతారామ
లోక మెల్ల మ్రొక్కునట్టి సీతారామ నా
శోకమును గమనింపుము సీతారామ
నీకందరు సమానులే సీతారామ భువ
నైకశరణ్యుడవు నీవు సీతారామ
కావుకావు మనెను కాకి సీతారామ నీవు
భావించితి వయ్య కృప సీతారామ
కావుకావు మను భక్తుని సీతారామ నీవు
కావ కుండుట భావ్యమా సీతారామ
నీవారని పైవారని సీతారామ నీ
వేవేళను తలపవండ్రు సీతారామ
నావాడవు నీవొకడవె సీతారామ నా
భావమెఱిగి నన్నేలుము సీతారామ
నిరుపమాన కృపాలయ సీతారామ ఈ
చరాచర జగతినేలు సీతారామ
ధరమీద నీ నామమె సీతారామ మా
నరులందరకు దిక్కు సీతారామ
పరాత్పర నీవు కాక సీతారామ ఈ
నరాధమున కెవరు దిక్కు సీతారామ
శరణుశరణు భువనేశ సీతారామ నన్ను
కరుణించుము వేడుకతో సీతారామ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)