చిత్తగించ వలెను మనవి శ్రీరామ నే
నుత్త మాటల ప్రోవు నోహో శ్రీరామ
పట్టరాని కోపమొకటి పైన వేదాంత మొకటి
చెట్టలాడు బుధ్ధియొకటి యట్టులుండగ
మెట్టవేదాంతమును జెప్ప మేటినైతిని నా
యుట్టుట్టి మాటలకు ఫలిత ముట్టిదే కాదా
పలుకుపలుకు వినయనటన చిలుకుచుండును
విలువనిచ్చి పలికినటుల పెద్దలెంచగ
చిలుకపలుకుల నట్లు చాల చెప్పనేర్చితి నా
పలుకులాడితనము నాకే ఫలిత మిచ్చేను
నేను భక్తుడ ననుచు తలచి నీకునై యిట్లు
పూని పలుకు కీర్తనలును లోన డొల్లలా
జ్ఞానహీనుడనయ్యు నేమో చాల చెప్పుదు
దానికే తప్పెంచకయ్య దశరధాత్మజా