తనకు తానె బంధంబులు తగిలించుకొని
తన నెవరో కట్టి రనుట తప్పు తప్పు తప్పు
చెడునడతల వారితో స్నేహము చేసి
చెడి దురదృష్ట మనుచు నడలుకొనుట తప్పు
నడమంత్రపు సిరులపైన నమ్మక ముంచి
చెడి విధిని తప్పుపట్టి చింతించుట తప్పు
వడిగల యొక సుడిలోన జడియక దుమికి
సుడియే పగబట్టిన దని శోకించుట తప్పు
పుడమిపై నెన్నేమార్లు పుట్టి చచ్చి కూడ
చెడ కుండిన భవమోహము జీవునిదే తప్పు
విడరాని దైవమును విడిచి వెఱ్ఱి యగుచు
దుడుకువై చెడి దేవుని దూఱాడుట తప్పు
ఒడయడై రామచంద్రు డుర్వి భక్తులకు మోక్ష
మిడుచున్నా డని తెలియదా యెవరిదయ్య తప్పు