నీ కృపయే చాలును నీరేజదళ నేత్ర
నాకైన నలువకైన నారాయణ రామ
పాపకులభూషణుని పడకజేసుకొంటివి
పాపాత్ముని నన్ను నీ భక్తునిగ గొంటివి
తాపోపశమనక్రియాదక్షమైన నీ కరుణ
నాపైన కురియనీ నారాయణా రామ
కుక్షిస్థాఖిలభువన పక్షిరాజవాహన
అక్షీణప్రేమామృత మందించు తండ్రి
అక్షరపరబ్రహ్మ మగు నీవు కాక
రక్షకు లింకెవరు నాకు రామనారాయణ
పలుజన్మ లెత్తితిని బాధలెన్నొ పడితిని
తెలివి తెచ్చుకొంటిని తెలిసి నిను చేరితిని
కలిగిన యీ తెలివిడిని కరగిపోనీయక
సలుపవే రక్ష రామచంద్ర నారాయణ