హరిబాబు గారు ఈనెల ఏడవ తారీఖున ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసారు:
ఒక చిన్న ముఖ్యమైన సందేహం,గజేంద్ర మోక్షం కధని "గజేంద్ర మోక్షణం" అని మాత్రమే అనాలి,ఆ సనివేశంలో మోక్షం ఇవ్వలేదు - కేవలం మకరి పట్టునుంచి విడిపించటం మాత్రమే జరగడం వల్ల మోక్షణం అనాలి అని ఒకరు చెప్పగా విన్నాను.కానీ నేను మీకిచ్చిన లింకు దగ్గిర గజేంద్ర మోక్షంకధా ప్రారంభం అని ఉంది.వ్యాసవిరచిత మూలంలో ఎలా ఉంది?
ముందుగా పోతనామాత్యుల రచన చూదాం. ఆయన అష్టమస్కందంలో 135వ పద్యంలో 'ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణకథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబు' అని శుకయోగీంద్రుని వాక్యంగా రచించారు. ఆ పద్యం పూర్తిపాఠం ఇదిగో.
సీ. నరనాథ! నీకును నాచేత వివరింపఁ
బడిన యీ కృష్ణానుభావమైన
గజరాజమోక్షణకథ వినువారికి
యశము లిచ్చును గల్మషాపహంబు
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ
బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకులైన
విప్రులకును బహువిభవ మమరు
తే.గీ. సంపదలు గల్గుఁ బీడలు శాంతిఁ బొందు
సుఖము సిద్ధించు వర్థిల్లు శోభనములు
మోక్ష మఱచేతిదై యుండు ముదము చేరు
ననుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.
ఇక సంస్కృతభాగవత పురాణం చూదాం.
వ్యాస భాగవతంలో
అష్టమస్కందం మొదట్లో ఒకశ్లోకంలో
తత్రాపి జజ్ఞే భగవాన్హరిణ్యాం హరిమేధసః
హరిరిత్యాహృతో యేన గజేన్ద్రో మోచితో గ్రహాత్
అని ఉంది. మోచనం అంటే విడిపించటం (మన తెలుగువాళ్ళకు విమోచనం అన్నమాట బాగా పరిచితమైనదే)
హరివలన మకరిపీడ తొలగిన గజేంద్రుడి సంగతిని ఇలా వ్యాసభాగవతం చెబుతున్నది.
గజేన్ద్రో భగవత్స్పర్శాద్విముక్తోఽజ్ఞానబన్ధనాత్
ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః
పోతనగారి సీసపద్యం మొదట ఉదహరించాను కదా, దానిమూలం వ్యాసప్రోక్తంగా ఇలా ఉంది:
ఏతన్మహారాజ తవేరితో మయా
కృష్ణానుభావో గజరాజమోక్షణమ్
స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం
దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్
అని.
శాపగ్రస్తుడైన ఇంద్రద్యుమ్నుడనే రాజు ఏనుగైనాడు. ఆయనకు కలిగిన మోక్షణం కేవలం మకరినోటి నుండే కాదు, హరిధ్యానంలో ఉండి అగస్త్యముని రాకను గమనించని కారణంగా పొందిన శాపం నుండి కూడా. అంతే కాదు భవబంధాలనుండి కూడా మోక్షణం పొందాడు. అదే మోక్షం. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములనే చతుర్విధముక్తుల్లో ఒకటైన సారూప్య ముక్తి ఆ గజరాజుకు హరిప్రసాదంగా లభించింది. అందుకే గజేంద్రుడు ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః అయ్యాడు. అనగా భగవంతుని రూపాన్నే పొందాడు అయన వలెనే పీతాంబరధారి అయ్యాడు చతుర్భుజములనూ పొందినాడు. అంటే గజరాజు ఇంక ఏనుగు వలె కాక విష్ణువువలె ఉన్నాడు అని కదా పిండితార్ధం.
దీనికి మరొక సాక్ష్యం గజేంద్రమోక్షణానంతరం గజరాజుతో హరిపలికిన మాటలే. ఇంకా శంక ఉంటే ఏదో రకంగా, అది కూడా తీర్చే మాటలు హరిప్రోక్తములే ఉన్నాయక్కడనే.
యే మాం త్వాం చ సరశ్చేదం .... అని మొదలు పెట్టి చివరన
యే మాం స్తువన్త్యనేనాఙ్గ ప్రతిబుధ్య నిశాత్యయే
తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాం గతిమ్
అని చెబుతాడు శ్రీహరి. హరి మాం..త్వాం.. అనటం గమనించండి. నన్నూ, నిన్నూ అని మొదలు పెట్టి స్తవనీయమైన మరికొన్ని విభూతులనూ పేర్కొని వీటిని స్మరించిన వారు ముచ్యన్తే తేఽహసోఽఖిలాత్ - అనగా అన్ని బంధాలనుండీ విముక్తులైపోతారని చెప్పాడు హరి. అంతే కాదు వారికి ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతిని ఇస్తాననీ చెప్పాడు. విమలగతి అంటే మోక్షం. ఈగజేంద్రస్మరణంతోనే మోక్షాధికారసిద్ధి అంటే ఆ గజరాజుకు మోక్షం వచ్చిందా అని మరలా ప్రశ్న వేసుకోవలసిన అగత్యం ఉందా?