22, సెప్టెంబర్ 2016, గురువారం

జీవాతుమై యుండు చిలుకా (అన్నమయ్య సంకీర్తనం)



జీవాతుమై యుండు చిలుకా నీ
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా

ఆతుమపంజరములోన నయమున నుండి నా చేతనే పెరిగిన చిలుకా
జాతిగాఁ కర్మపు సంకెళ్ళఁ‌బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపు రెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా
నెన్నెవరు

బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ‌ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రు లారుగురికిఁ గాక అడిచిపడువే నీవు చిలుకా
వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁ గూడి మెలగిన చిలుకా
నిన్నెవరు

నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ చిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తమ్ములో నుండి సేవించుకొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపున బాయని చిలుకా
యేవియును నిజముగా వివి యేఁటికని నాకు నెఱిఁగించి నటువంటి చిలుకా
నిన్నెవరు


(ఆహిరి రాగంలో అన్నమాచార్యసంకీర్తనం. 8వ రేకు)

వివరణ:

ఇది ఒక తత్త్వప్రబోధకమైన గీతం. ఇలాంటివాటికి తెలుగుదేశంలో తత్త్వాలు అని పొట్టిపేరు గట్టిగా ప్రచారంలో ఉండేది. ఐతే ఆదునిక కాలంలో పాట అంటే సినిమా పాట మాత్రమే ఐపోయినందువలన జనబాహుళ్యానికి తత్త్వము అంటేనూ తెలియదు తత్త్వాలు అంటేనూ తెలియదు. అది వేరే సంగతి.

ఈ‌తత్త్వాలలో ఒక సామాన్యలక్షణం ఏమిటంటే అవి సాధారణంగా జటిలంగా ఉంటాయి. అన్నీ తెలిసిన మాటలే ఉన్నా ఆ పాటల్లో ఉండే కొన్నికొన్ని పడికట్టుమాటలూ కొన్ని కొన్ని తెలిసినట్లే ఉండే మాటలకు గూఢార్థాలూ కారణంగా అవి ఏ‌ జనబాహుళ్యాన్ని ఉద్దేశించి చెప్పబడ్డాయే ఆజనబాహుళ్యానికే బోధించి చెబుతే కాని బోధపడవు. ఆయా పాటలు వ్రాయబడిన రోజుల్లోని పరిస్థితి అంత దీనంగా లేదేమో కాని ప్రస్తుతం అవి వ్యాఖ్యానాపేక్ష కలవేను.

సరే ఈ తత్త్వగీతం చూదాం.

ఓ చిలుకా నీవు జీవాత్ముడవుగా ఉన్నావు.
ఈవల ఈప్రకృతిలో నీవు జీవాత్మవే కావచ్చును.
కాని ఆవల అంటే ప్రకృతికి వెలుపల, నీ నిజమైన స్వరూపంలో నీవు పరమాత్ముడవే.
అయ్యో ఈ‌సంగతి నీకు తెలియదు. ఈ‌ప్రకృతి నీకు ఆ సంగతిని మరపులో ఉండేలా చేస్తోంది.

నీ యొక్క నిజమైన స్వరూపాన్ని నేనే చూడు. తెలివి తెచ్చుకో.
ఆత్మ అనే పంజరంలో నీవు నీ నిజస్థితిలో నాకు ప్రతిబింబమాత్రుడివిగా ఉన్నావు.
నీ స్వస్వరూపంలో నాచేతుల్లో ఉంటూ నాలాగే  మెలిగేవాడివి.
కానీ ఇప్పుడు అలా లేవే.

ఎప్పుడైతే నానుండి నీవు 'నేను వేరు' అన్న భావనను పొందావో ఆ అహంభావం నిన్ను నానుండి దూరం చేసింది. అది  ఒక వదలించుకోలేని బంధం ఐపోయింది. అక్కడి నుండీ నీవు ఏది చేసినా అది 'నేను చేస్తున్నాను' అన్న పొరపాటు భావనతోనే చేస్తూ వస్తున్నావు. అదే కర్మబంధం! అందులో పడిచిక్కుకున్న నీవు నీతెలివిని పోగొట్టుకొని పేదవైనావు. ప్రకృతిలో అప్పటివరకూ నాలాగే స్వతంత్రంగా వ్యవహరించిన నీకు ప్రకృతికి బానిసగా మారిపోవలసిన స్థితి కలిగింది.

ఈ ప్రకృతి యొక్క కాలస్వరూపాన్ని దాని తత్త్వాన్ని తెలిపే సమస్తవిజ్ఞానాన్ని నీకు నేను ముందే అందించాను. ఎంతో చక్కగా నేర్చి ప్రకృతిలో హాయిగా విహరించే వాడివి. కాని ఎప్పుడైతే నీవు అహంకరించి నా అంతవాడిని నేను అన్న తప్పుడు భావనకు వచ్చావో నాకన్నా భిన్నుడను అనుకున్నావో, అప్పటినుండి నీవు కేవలం ఒక దేహివి మాత్రం ఐపోయావు. నీవు ప్రీతిగా పొందిన ఆదేహం అల్పమైనది. దానిలో దాగి ఉండాలని నీ ప్రయత్నం. కాని అది నిన్ను రక్షించలేకపోతోంది కదా. దాని రక్షణలో ఉన్నానని అనుకొనే నీవు ఈ ప్రకృతిదెబ్బలకు ఓర్చుకోలేకపోతున్నావు కదా. ఇప్పటికైనా తెలివితెచ్చుకో. నీవు ఈదేహానికి బధ్ధుడివి కావు. నీవు నీవే. నా ప్రతిబింబానివి. మేలుకో.

నిన్ను ఈప్రకృతిలో అన్నివైపులకు గుంజుతున్న ఈ పంచేంద్రియాలకు భయపడి అన్నివైపులకు పరుగెడుతున్నావే. నీకేమో ఆరుగురు శత్రువులున్నారు. వాళ్ళని నేను అరిషడ్వర్గం అని అంటాను. నీవేమో మంచి మిత్రు లనుకుంటున్నావు లాగా ఉంది. ఎంతో గర్వించి వాళ్ళతో చెలిమి చేస్తున్నావే.

వారి చెలిమి వలన నీవు టక్కరివైపోయావు. తిండి సంపాదించి ఈ‌ నీదని భావించుకొనే దేహానికి పెట్టంటం కోసం పదివేల పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు నిత్యం. ఒకప్పుడు నువ్వేనా నాతో కలిసిమెలిసి ఉండి నువ్వేనేనని ఎంతో మమతతో మెలిగినది అని ఆశ్చర్యం వేస్తుంది.

నిత్యం నీవు-నేను అంటూ ఉంటావే! నిజానికి నువ్వెవరు? నేనెవరు? ఇద్దరమూ ఒకటే కదా.
ఇకనైనా మేలుకో.
శ్రీవేంకటాద్రికి చేరుకో.
నీ చిత్తంలో నీవు స్థిరంగా నిలచి నీవెవ్వడవో ఆలోచించుకో.
తపించి నిజం స్థిరపరచుకో.

అలా వేంకటాద్రిని చేరుకున్నావా?
ఆ వేంకటాద్రీశుడిని సేవించుకున్నావా?
ఆయనకృపతో నీకు తత్త్వం బోధపడిందా?

ఏది దైవసంబంధమైన ప్రకాశతత్త్వమో తెలిసిందా?
ఏది మానుషమై అహంకారం కారణంగా నిలకడలేక తిరుగుతున్న తప్పుడు జీవితమో తెలిసిందా?
ఆ రెండింటినీ చిత్తంలో చక్కగా కనుగొన్నావా?
ఆ బోధపడిన తత్త్వం నీ చిత్తంలో స్థిరంగా కుదురుకున్నదా?
ఎన్నడూ ఇంక ఆ సత్యస్వరూపాన్నుండి దూరంగా జరిగిపోవటం లేదు కదా.
తస్మాత్ జాగ్రత. మరలా ప్రకృతిమాయలోనికి జారిపోగలవు.

స్థిరంగానే ఉన్నావా. సంతోషం సంతోషం.
"ఈ లోకంలో ఏవీ‌ సత్యవస్తువులు కావు. ఇవన్నీ నాకెందుకు" అంటున్నావా.
చాలా మంచిది.
ఈ మాటను నాతో స్థిరంగానే చెబుతున్నావు కదా.
ఇప్పుడు సరైనదారి లోనికి చక్కగా వచ్చావు.


సత్యమైన తత్త్వం నీకు బోధపడినపిమ్మట ఇంకా నేనేమిటి నువ్వేమిటి?
ఇద్దరమూ ఒకటే అనటం బాగుంటుంది.
అవును. నీవే నేను - నేనే నీవు.