6, సెప్టెంబర్ 2016, మంగళవారం

జనకసుతావర నీవుతలచిన చక్కబడునురా ఈ‌బొమ్మ




మోతగ మాటలు నీవు నేర్పక తైతైబొమ్మ పలెకెడి దేమి
నీతులు రీతులు నీవు నేర్పక తైతైబొమ్మకు తెలిసిన దేమి


వచ్చే దాకా కన్నులు రెండూ విచ్చే దాకా తానెవరో
వచ్చి భూమికి కన్నులు రెండూ విచ్చిన పిదప తానెవరో
వచ్చే టప్పుడు బుధ్ధిగ బ్రతికే ప్రతిన చేసిన తానెవరో
చచ్చి హెచ్చిన గరువముతోడ వదరుచు నెఱుగదు తానెవరో
మోతగ

ఆటలాడుచు స్వయముగ తానే అంతా నేర్చితినని పలికే
మాటలాడుచు మరి వాగ్విభవం‌ బంతా తనదే నని పలికే
చీటికిమాటికి తన తలపండున చెలగును తెలివిడి యని పలికే
ఓటికుండకు మోత యెక్కుడన నోటిదురరతో కడు పలికే
మోతగ

తనయునికికి కారణమగు నిన్నే తలచకున్నది ఈ‌బొమ్మ
తనమనికికి నీదయ కారణమని తలచకున్నది ఈబొమ్మ
మనవిచేసెదను మాయచేత నిను మరచియున్నదిర ఈ బొమ్మ
జనకసుతావర నీవుతలచిన చక్కబడునురా ఈ‌బొమ్మ
మోతగ