ఈశ్వరుడంటే హితకరుడు ఈశ్వరుడంటే శుభకరుడు ఈశ్వరుడంటే హృదయస్థితుడౌ శాశ్వతపదసంపత్కరుడు |
|||
ఈశ్వరాఙ్ఞయే లేకుండినచో నిచ్చట నీవే లేవుకదా ఈశ్వరాఙ్ఞయే కాకుండినచో నేది సుఖేఛ్చ, లేదు కదా ఈశ్వరునందు నీదు చిత్తమే యెల్లవేళల నిలచినచో ఈశ్వరుడే నీవాడని తెలియుట కేమి యడ్డము లేదు కదా |
ఈశ్వరు డంటే | ||
ఈశ్వరసంకల్పముగా కలిగిన దీజన్మంబని తలచినచో ఈశ్వరకార్యము నెఱవేర్చుటకే యిలనుంటినని తలచినచో ఈశ్వరబుధ్ధుల సత్సంగమునే యెల్లవేళల వలచినచో ఈశ్వరుడే నీవాడైయుండుట కేమి యడ్డము లేదుకదా |
ఈశ్వరు డంటే | ||
ఈశ్వరుడిచ్చిన కాల మంతయును నీశ్వరభావన నుండినచో ఈశ్వర సాంగత్యమునే కోరుచు నెల్లవేళల నిలచినచో ఈశ్వరమయ మీ జగమున నెల్లడ నీశ్వరునే కనగలిగినచో ఈశ్వరుడును నీ వొకటి యగుట కింకేమి యడ్డము లేదు కదా |
ఈశ్వరు డంటే | ||
19, ఏప్రిల్ 2016, మంగళవారం
ఈశ్వరుడంటే హితకరుడు
లేబుళ్లు:
ఆధ్యాత్మ కవితలు - కీర్తనలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)