20, జనవరి 2016, బుధవారం

హలముఖీ వృత్తంలో విన్నపం.







        హలముఖి.
        కాముకుండు దశముఖునిం
        రామచంద్ర దునిమితివే
        తామసంబు నణచుమయా
        యీ మనంబు దశముఖమే




హలముఖి.

హలముఖి వృత్తానికి గణవిభజన ర-న-స. అంటే పాదానికి తొమ్మిది అక్షరాలు. యతిమైత్రి ఏమీ అక్కరలేదు. ప్రాసనియమం ఉంది.

ఈ వృత్తానికి గురులఘుక్రమం  UIU III IIU. దీనిలో మొత్తం   12మాత్రలున్నాయి.  ఈ గురులఘుక్రమాన్నే మనం UI UI III IU అని త్రిమాత్రాగణాలుగా కూడా చూడవచ్చును.

విశ్వనాథవారు ఈ వృత్తాన్ని వ్రాసారని తెలుస్తోంది.  ఆ సందర్భాన్ని ప్రొద్దు పత్రికలో చదివాను. "ముక్కూచెవులు కోసేసినప్పుడు శూర్పణఖ కోపంతో బొబ్బలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అలా అలా ఎగిరిపోతున్న శూర్పణఖ మాటలు ఒక నాలుగు పద్యాలలో రచించారు. అందులో మొదటి పద్యం లాటీవిటమనే ఛందస్సు, రెండవది అసంబాధము, మూడవది హలముఖి, నాలుగవది వ్రీడ. మొదటి పద్యంలో పాదానికి యిరవయ్యొక్క అక్షరాలు. రెండవ దానిలో పధ్నాలుగు, మూడవ దానిలో తొమ్మిది, చివరి దానిలో నాలుగు అక్షరాలు. ఇలా పద్య పరిమాణం క్రమేపీ తగ్గుతూ పోతుంది."

నడక విషయానికి వస్తే, మొదటి ఆరుమాత్రల తరువాత అంటే నాలుగవస్థానం తరువాత విరుపు కనిపిస్తుంది. అంటే ఆరేసి మాత్రల చొప్పున పాదాన్ని సమద్విఖండనం చేస్తున్నది విరుపు.