మణిమధ్యము. మానవుడా యో మానవుడా మానక శ్రీరామా యనరా దేనికయా సందేహము వే రైనది మంత్రంబా చెపుమా |
మణిమధ్యం.
ఈ వృత్తానికే మణిబంధం అనే మరొక పేరు కూడా ఉంది.
ఈమణిమధ్య వృత్తానికి గణవిభజన భ-మ-స. కాబట్టి గురులఘుక్రమం UII UUU IIU. దీని పాదానికి తొమ్మిదే అక్షరాలు. పాదదైర్ఘ్యం పదక్షరాలలోపే కాబట్టి యతిమైత్రి అక్కరలేదు. కాని వృత్తాలన్నింటికీ ప్రాసనియయం ఎలాగూ తప్పని సరి.
దీని పాదంలో గురులఘుక్రమం UII UUU IIU అని కాక UIIU U UIIU అనిచూడంటం సముచితంగా ఉంటుంది. అంటే భగ-గ-భగ అని అన్నమాట. ఇలా చూడటం వలన నడకను సులువుగా అంచనా వేయటానికి వీలవుతుంది.
ఒక తమాషా ఏమిటంటే ఈగురులఘుక్రమం UII UUU IIU అనేది ఎడమనుండి కుడికి బదులు కుడినుండి ఎడమకు చదివినా తేడా రాదు. అద్దం ముందు బింబప్రతిబింబ సామ్యం అన్నట్లు.
ఆధునికులు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి మణిమధ్య వృత్తాలు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి.
ఈ మణిమధ్యానికి 5వ స్థానాన్ని యతిమైత్రికి స్వీకరిస్తే బాగుంటుందని జె.కె.మోజనరావుగారి అభిప్రాయం, కాని నిజానికి అంతకంటే 6వ స్థానమే బాగుంటుంది . మణిమధ్యంలో ఉన్న మధ్య గురువును రెండులఘువులుగా మారిస్తే అది చిత్రగతి లేదా పంక్తి వృత్తం అవుతున్నది. అలా మణిమధ్యంతో ఆంతరంగిక మైత్రికల చిత్రగతికి ఆయన ఆయన తీసుకున్న యతిమైత్రి 7వస్థానం. ఆ సంగతి కూడా మణిమధ్యానికి 6వస్థానాన్నే యతిస్థానానికి ఉచితం అని బలపరుస్తోంది. ఇప్పటికే మనం పంక్తి వృత్తం చెప్పుకున్నాం . కాని నిజానికి పదక్షరాలలోపు పాదానికి యతిమైత్రి అవసరం కాదు. ఇక్కడ నేను వ్రాసిన పద్యంలో 6వ స్థానం యతిమైత్రి కూర్చటం కేవలం ఐఛ్ఛికమైన వ్యవహారంగానే భావించండి.
ఈ మణిమధ్యంలో మొత్తం మాత్రల సంఖ్య 14. చివరి గురువు మరొక రెండుమాత్రలు అధికంగా ధ్వనించి మొత్తం16 మాత్రలిగా దీని నడక చతురస్రగతిలో ఉంటుంది.
మానవు | డా ఓ | మానవు | డా |
మానక | శ్రీరా | మా యన | రా |
దేనిక | యా సం | దేహము | వే |
రైనది | మంత్రం | బా చెపు | మా |