అర్జునుడితో తలపడి తలలు బొప్పికట్టించుకొని కుయ్యోమొఱ్ఱో అని ప్రమధులు ఆయుధాలనుకూడా పారేసి పారిపోయారని చదువుకున్నాం. వాళ్ళకి తమపక్షాన సాక్షాత్తూ పరమశివుడే ఉన్నాడు కదా భయం దేనికి అన్న ఆలోచన కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ సేనాపతి దేవసేనాని కుమారస్వామి నాయకత్వం వహిస్తూ అక్కడే వాళ్ళమధ్యనే ఉన్నా వాళ్ళెవరూ ఆ సంగతే ఆలోచించలేదు. పారిపోయారంతే. సరే లెండి, అసలు అక్కడ సాక్షాత్తూ శివుడున్నా వాళ్ళు పారిపోయారంటుంటే కుమారస్వామి గురించి ఎందుకు అనటం?
అలా పారిపోతున్న వాళ్ళ మీద అర్జునుడికి కాస్త దయ కలిగిందని కదా అన్నాడు కవి? అవును మరి. గొప్పగొప్ప వాళ్ళు అసలే బాధలో గోలపెడుతున్నవాళ్ళని మరింతగా బాధించటానికి ప్రయత్నిస్తారా ఏమిటి? ప్రయత్నించరు కదా. అందుకే అర్జునుడు కూడా వాళ్ళని కొంచెం మెల్లమెల్లగానే అదిలించాడు. అంతే కాని ఆ వెన్ను చూపుతున్న వాళ్ళని మరీ ఏడిపిస్తూ వాడిబాణాలతో వేగంగా తరమలేదు.
ఇదంతా చూసి శివుడు నవ్వుకున్నాడేమో. కాని కుమారస్వామికి మాత్రం ఉక్రోషం వచ్చి ఒళ్ళు మండిపోయింది. తన సమక్షంలోనే తన సైన్యం తననీ కనీసం శివుణ్ణైనా లెక్కపెట్టకుండా పొలోమని యుధ్ధరంగం నుండి పరిగెత్తటమా? వెంటనే ఆయన ఆ పారిపొతున్న సైన్యం ముందుకు వేగంగా వెళ్ళి నిలబడి అదిలించాడు. వాళ్ళు కొంచెం సంశయంగా అగగానే వాళ్ళకు గట్టిగా పాఠం చెప్పటం మొదలు పెట్టాడు.
అథాగ్రే హసితా సాచి
స్థితేన చిరకీర్తినా
సేనాన్యా తే జగదిరే
కించిదాయస్త చేతసా
స్థితేన చిరకీర్తినా
సేనాన్యా తే జగదిరే
కించిదాయస్త చేతసా
ఈ శ్లోకం యొక్క భావం ఎమిటంటే, చిరస్థాయిగా ఉండే గొప్పకీర్తికల ఆ కుమారస్వామి, తన సైన్యం దురవస్థ చూసి, వాళ్ళ ఎదుటకు వెళ్ళాడు. అయన మనస్సు కొంచెం బాధతో ఉంది. ఐనా నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన వాళ్ళకు ధైర్యం చెప్పటానికి గాను ఇలా మాట్లాడుతున్నారు అని.
ఈ శ్లోకంలో చిత్రంగా ఉండే సంగతి ఏమిటబ్బా అని అడుతున్నారు కదా?
ఇది ఒక నిరోష్ఠ్య శ్లోకం. అర్థం కాలేదా? ఓష్ఠం అంటే పెదవి. ఓష్ఠ్యం అంటే పెదవుల సహాయంతో కుదిరేది అని అర్థం. నిరోష్ఠ్యం అంటే పెదవుల సాయం అక్కర్లేనిది అని.
ఈ శ్లోకాన్ని పైకి చదవండి. పెదవులు కదపకుండానే మొత్తం శ్లోకం నడిచింది కదా?
అదే ఇక్కడి విశేషం.
లాక్షణికులు చెప్పేది ఏమిటంటే ఏ మాట(ల) కైతే ప-వర్గమూ (అంటే ప,ఫ,బ,భ.మ) , వ, ఉ,ఊ, ఒ,ఓ అనే అక్షరాలూ వాడమో అవి నిరోష్ఠ్యాలు అని. మొత్తం శ్లోకమైనా తెలుగుపద్యమైనా అలా వ్రాస్తే అది నిరోష్ఠ్యం అనిపించుకుంటుంది.
నిరోష్ఠ్యం గా పద్యం వ్రాసినా శ్లోకం వ్రాసినా అదీ చిత్రకవిత్వమే అవుతుంది.
దండి అనే కవి సంస్కృతంలో దశకుమారచరితం అని ఒక అద్భుతమైన కావ్యం వ్రాసాడు. అందులో అనేక కథలున్నాయి. ఒక కథ మంత్రగుప్తుడు అనే సాహసి గురించినది. ఆ మంత్రగుప్తుడు సాహసయాత్రల్లో ఒకదానిలో ఒక అందమైన అమ్మాయిని సంపాదించుకున్నాడు. సరసంలో భాగంగా ఆ పిల్ల మంత్రగుప్తుడి పెదవి కొరికింది. కొంచెం ప్రేమ ఎక్కువైనట్లుంది. అందుకని పెదవి చిట్లింది. ఒక వైపు బాధ, మరొకవైపు ఆనందం ఆ మహానుభావుడికి. సరే అతను ఆ అమ్మాయికి కథ చెప్పటం మొదలు పెట్టాడు. కాని ఎట్లా పెదవులు కలిపితే బాధ కలుగుతుందే! అందుకని దండి ఆ మంత్రగుప్తుడి పాత్రతో చెప్పించిన కథ అంతా నిరోష్ఠ్యంగా వ్రాసాడు. చూసారా మరి. సారస్యం అంటే అదీ. ఎవరండీ పాత కవుల భావుకతని ఎగతాళి చేసేదీ?
మీరు కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరు వినే ఉంటారు కదా. ఆయన గురించి నాలుగు మాటలు చెప్పమంటే ఆయన సంఘసంస్కరణాకార్యక్రమాల గురించి చెబుతారు కదా? ఐతే మరొక సంగతి కూడా ఆయన గురించి ఈ సారి చెప్పండి. వీరేశలింగం పంతులు గారు శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచననైషధము అని ఒక అచ్చతెలుగు కావ్యం వ్రాసారు. అంటే ఒట్టుపెట్టుకొని ఒక్క సంస్కృతం ముక్కా ఎక్కడా రాకుండా నలుడి చరిత్రను ఏకంగా ఒక కావ్యంగా వ్రాసారన్న మాట. అదే గొప్ప విశేషం ఐతే అంతకన్నా గొప్ప విశేషం, అది నిరోష్ఠ్యకావ్యం కావటం. అంటే ఆ కావ్యం మొత్తం మీద ఎక్కడా ప, ఫ, బ,భ, మ, వ ఉ, ఊ, ఒ, ఓ అనే అక్షరాలు లేవు. అన్నట్లు నిర్వచనం అని కూడా ఆ గ్రంథం పేరులో ఉంది కదా. దానర్థం పద్యాలు తప్ప వచనంగా పంతులు గారు ఎక్కడా వ్రాయలేదన్నమాట. సామాన్యమైన సంగతి కాదు కదా ఈ కావ్యం ఆయన వ్రాయటం?
శాకల్యమల్లయ్య భట్టు అనే కవి నిరోష్ఠ్య రామాయణం వ్రాసాడు.
మరింగంటి సింగనాచార్యులు శుద్దాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం కావ్యం రాశారు.
వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు నిరోష్ఠ్య కావ్యాలు వ్రాసారని విన్నాను వివరాలు తెలియవు.
నల్లంతిఘల్ చక్రవర్తుల లక్ష్మీనరసింహాచార్యులు అనే కవి గారు శుద్ధాంధ్ర నిర్గద్య నిరోష్ఠ్య కేకయ రాజనందన చరిత్రం అనే గ్రంధం వ్రాసారు. నిర్గద్యం అంటే గద్యం లేనిది అని. నిర్వచనం అన్నా అర్థం అదే.
ఇలా నిరోష్ఠ్యంగా ఒక పద్యమో శ్లోకమో వ్రాయటమే కాదు, ఏకంగా కవులు కావ్యాలే వ్రాసారు.
ఇప్పుడు మరొకసారి భారవి ఇచ్చిన ఈనిరోష్ఠ్యశ్లోకాన్ని పెదవులు అస్సలు కదపకుండా హాయిగా చదివి ఆనందించండి. మీదే ఆలస్యం. ఇంకా కొంచెం అనుమానం ఉన్న వాళ్ళకి ఒక ఉపాయం చెప్పనా, పెదవుల సంగతి అలా ఉంచండి. పళ్ళను గిట్టకరచుకొని ఈ శ్లోకాన్ని చదివిచూడండి, పెదవులతో పని లేకుండా ఎలా పనిజరిగిపోతుందో.