విద్యున్మాల రారా నిన్నా రాధింతున్ సం సారంబన్ విస్తారంబౌ ని స్సారంబౌ కాసారం బందే దారిం గానం దండ్రీ రామా |
విద్యున్మాల.
ఈ విద్యున్మాలావృత్తానికి గణవిభజన మ-మ-గగ. అంటే పాదానికి 8అక్షరాలు.ఇందులో అన్నీగురువులే. మచ్చుకు కూడా ఒక్కటంటే ఒక్క లఘువు కూడా లేదు. నాగవర్మ ఈ విద్యున్మాలను విద్యున్మాలి అన్నాడు.
వృత్తంలో పాదానికి పది కన్నా తక్కువ అక్షరాల నిడివి ఉంటే అటువంటి వృత్తానికి యతిస్థానం అవసరం లేదు. అన్ని వృత్తాలకూ సహజంగా ఉండే రెండు నియమాలూ మాత్రం ఉంటాయి. మొదటిది ప్రాస తప్పనిసరి కావటం. రెండవది పాదం చివరి అక్షరం తప్పనిసరిగా గురువుగా ఉండే అన్న లక్షణం కలిగిఉండటం. యతిస్థానం అవసరం లేకపోయినా ఈ వృత్తానికి కొందరు ఐదవ అక్షరాన్ని యతిస్థానంగా వాడుకచేయటం కనిపిస్తోంది
పాదానికి ఉన్న అక్షరాలన్నీ గురువులే అంటే వృత్తం మొత్తంలో కూడా అదే పరిస్థితి కదా. ఈ విద్యున్మాలకైతే పద్యం పూర్తికావాలంటే అక్షరాలా ముఫైరెండు గురువుల్ని వరసపెట్టి వ్రాయవలసి ఉంటుంది. అదీ ప్రాసనియమాన్ని పాటిస్తూ. తెలుగుభాషలో అన్ని గురువుల్ని వరసపెట్టి తెచ్చి వ్రాయటం దుష్కరమే. అందుచేత ఇలా వరసగురువుల వంటి బెడద తగిలినప్పుడు కవులు సంస్కృతాన్ని శరణువేడక తప్పదు.
అనంతుడి ఛందోదర్పణంలోని ఉదాహరణ పద్యం చూడండి:
మాద్యద్భక్తిన్మాగాయుక్తిన్
విద్యున్మాలా వృత్తం బొప్పన్
చైద్యధ్వంసిన్ సంబోధింపన్
సద్యశ్శ్రేయోజాతంబయ్యెన్.
యతిస్థానం అవసరం లేకపోయినా అనంతుడి పద్యంలో ఐదవస్థానాన్ని యతిస్థ్హానంగా తీసుకొని వ్రాసినట్లు చెప్పవచ్చును.
ఆధునికులు శ్రీనేమాని రామజోగిసన్యాసిరావు గారి అథ్యాత్మరామాయణంలోని ఒక విద్యున్మాల:
శ్రీమన్మూర్తీ శిష్టత్రాతా
రామా రాజద్రాజీవాక్షా
ప్రేమానందా విశ్వస్తుత్యా
శ్యామా సీతాస్వాంతాబ్జార్కా
అనంతుడి ధోరణిలోనే, తన ఈ పద్యంలోనూ, ఈ గ్రంథంలోని ఇతర విద్యున్మాలల్లోనూ కవిగారు 5వ అక్షరాన్ని ఐఛ్ఛికంగా యతిస్థానంగా తీసుకొన్నారు.
అంతర్జాలంలో కూడా కొన్ని విద్యున్మాలలున్నాయి. మచ్చుకు ఒకటి:
ప్రాణాధారం భక్తాధీనం
గానామోదం కావ్యానందం
దీనోద్ధారం దీవ్యత్తేజం
వీణాపాణిం విద్యాం వందే
సుప్రభగారు ఇక్కడ పైనిచ్చినది కాక మరొక రెండు విద్యున్మాలలూ వ్రాసారు చూడండి .