8, డిసెంబర్ 2015, మంగళవారం

ద్రుతవిలంబితం





     ద్రుతవిలంబితం.
     ఇచటి   సౌఖ్యము లెప్పుడు గోరినా
     నచటి భోగము లెప్పుడు గోరినా
     నెచట రాఘవు నెప్పుడు మెత్తురే
     నచట నుండెద నంతియ జాలదే

      
            



ద్రుతవిలంబితం.
ఈ ద్రుతవిలంబిత వృత్తానికి గణవిభజన న - భ - భ - ర. యతిస్థానం 7వ అక్షరం. పాదానికి 12అక్షరాలు కాబట్టి యతిస్థానం దగ్గర సమంగా విరుగుతున్న దన్న మాట.

ఈ ద్రుతవిలంబిత వృత్తంలో ఒక తమాషా దాగి ఉంది.  మొదట వచ్చే 'న' గణం‌ ఒక సూర్యగణం కూడా. అలాగే తరువాతి రెండూ భగణాలే కదా.  'భ' గణం‌ ఒక ఇంద్రగణం‌. చివరి గణమైన 'ర' గణం‌ ప్రక్కన ఒక లఘువు చేర్చితే? అప్పుడు 'ర' గణం  U I U అన్నది U I U I గా మారుతుంది ఇది U I - U I అని విదదీస్తే రెండు 'హ' గణాల జంట.  మరి 'హ'  ఒక సూర్యగణం. అవును కదా. ఇప్పుడు ఏతావాతా తేలింది ఏమిటీ? ఒక ద్రుతవిలంబితం పాదానికి అదనంగా ఒక లఘువు చేర్చితే అప్పుడు గణ క్రమం  సూర్యగణం - రెండు ఇంద్రగణాలూ - రెండు సూర్యగణాలు అయ్యింది. అంటే‌ ఒక తేటగీతి పాదం అన్నమాట.  ఐతే గియితే యతిస్థానం వేరుగా ఉంటుంది, ద్రుతవిలంబితానుకీ తేటగీతికీ.

ద్రుతవిలంబితం      III - UII - UII - UIU          న - భ - భ - ర
చివరలఘువుతో     III - UII - UII - UI  - UI     న - భ - భ - హ - హ   => సూ - ఇం - ఇం - సూ - సూ
                     

శంకరాభరణం బ్లాగులో పండిత శ్రీనేమాని రామజోగి సన్యాసి రావు గారు  ఈ‌ ద్రుతవిలంబితం పైన ఒక టపా వ్రాసారు.  ఇలా ద్రుతవిలంబితంలో తేటగీతిని గర్భితం చేయవచ్చునని ఆయన అందులో ప్రస్తావించారు. ఆ టపాలో ఆయన ఇచ్చిన ద్రుతవిలంబితవృత్త పద్యం ఇదిగో

    జయము రాఘవ! సద్గుణ వైభవా!
    జయము విశ్రుత సత్య పరాక్రమా!
    జయము రాక్షస సంఘ వినాశకా!
    జయము సద్ఘన! సాధు జనావనా!

అదే చోట శ్రీ‌కంది శంకరయ్యగారి ద్రుతవిలంబిత పద్యం.

    రవికులోత్తమ! రామ! దయానిధీ!
    భవభయాపహ! భాగ్యవిధాయకా!
    భువనమోహన! మోహవినాశకా!
    శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

ఈ‌ ద్రుతవిలంబితంలో యతిస్థానం పాదంలో సరిగ్గా మధ్యన వస్తుందని చెప్పాను కదా.  యతిస్థానం దగ్గర మాట విరిగితేనే‌ కాని ఈ‌ వృత్తానికి నడకలో అందం రాదనుకుంటాను. ఈ విషయం మరింతగా అలోచించదగ్గది.