23, నవంబర్ 2015, సోమవారం

రామావతార ప్రయోజనం గురించి ఒక నర్కుటం







          నర్కుటము.
          మునుకొని యొక్క రాక్షసుని
               మొత్తగ వచ్చిన నా
          తని నొకనిన్ వధించి
               తన దారిని బోవక యా
          దనుజకులంబు సర్వమును
               దండన సేయుట రా
          ముని కన ధర్మరక్షణమె
               ముఖ్యము కావుననే
      



ఈ‌నర్కుటం ఇంచుమించు చంపకమాలలాగే ఉంటుంది.

గణవిభజన:  న - జ - భ - జ - జ - వ  మొత్తం‌ 17 అక్షరాలు.
యతిస్థానం:  11వ అక్షరం.

చంపకమాలకైతే గణవిభజన న - జ - భ - జ - జ - జ - ర  అని ఉండి యతిస్థానం అక్కడ కూడా 11వ అక్షరమే.  అంటే చంపకమాల చివర కొద్ది మార్పు అన్నమాట.  చంపకమాలకు 21 అక్షరాలు.  నర్కుటానికి 17 అక్షరాలు.

చంపకమాల:  I I I - I U I - U I I - I U I - I U I - I U I - U I U
నర్కుటము:  I I I - I U I - U I I - I U I - I U I - I U 

అనగా చంపకమాలలోని చివరి నాలుగు అక్షరాలు తీసివేస్తే అదినర్కుటము అవుతుందన్నమాట!

ఈ‌ నర్కుటము కూడా సాధారణంగా వాడరు - ఏదో ఆశ్వాసాంత పద్యాలలో తప్ప!

పారిజాతాపహరణం ప్రబంధంనుండి ప్రథమాశ్వాసం చివరన ఉన్న నర్కుటము:

     ప్రసృతి విలోచనా కుసుమబాణ! దిశా లలనా 
     ఘుసృణ పటీర లేపకృతి కోవిద! బాహుతటీ 
     విసృమర కీర్తిజాల! రణ వీక్షిత వైరినృప 
     త్యసృగతి పంకిలాసిముఖ! యైందవ వంశ మణీ!

ఇదీ అంతాసంస్కృతమే. తెలుగు నర్కుటం ఎందుకైనదిరా అంటే యతులూ, ప్రాసలు పాటించాం గదండీ అందుకు అని చెప్పుకోవాలి.

ఇప్పుడు పైన నేను వ్రాసిన నర్కుటం గురించి ఒక్కముక్క
          మునుకొని యొక్క రాక్షసుని మొత్తగ వచ్చిన నా     
          తని నొకనిన్ వధించి తన దారిని బోవక నా
          దనుజకులంబు సర్వమును దండన సేయుట రా
          ముని కన ధర్మరక్షణమె ముఖ్యము కావుననే

నర్కుటం నడక చంపకమాల ధోరణిలోనే ఉంటుంది. మన తెలుగుపద్యాల్లో కవులకు ఒక సౌలభ్యం ఉంది. అదే ప్రవాహగుణం. అంటే ఒక పాదం చివర మాట పూర్తికాని సందర్భాల్లో ఆ మాట తరువాతిపాదంలో కొనసాగటం.  అది తరచుగానే పద్యాలు వ్రాయటానికి అవసరం అవుతూ ఉంటుందన్నది అనుభవం మీద బోధపడవలసిన సంగతి. అందుచేత పాఠకులకు పద్యాన్ని చదవటంలో సరిగా విడదీసి చదువుకోవటం తప్పనిసరి ప్రయాస. ఈ‌పద్యాన్ని సరిగా విరిచి చదివితే ఇలా ఉంటుంది.


          మునుకొని యొక్క రాక్షసుని మొత్తగ వచ్చిన(చో)
          ఆతని నొకనిన్ వధించి తన దారిని బోవక 
          (తాను) ఆ దనుజకులంబు సర్వమును దండన సేయుట
          రాముని కన(గా) ధర్మరక్షణమె ముఖ్యము కావుననే

 కుండలీకరణం చేసి చూపిన భాగాలు పద్యంలో భాగాలు కావు. కేవలం అన్వయ సౌలభ్యం కోసం చూపటం జరిగింది. అలాగే కొన్ని ద్రుతాలనూ‌ వదిలి చూపాను.