శ్రీ కష్టేఫలీ శర్మగారు నిన్న వరూధిని బ్లాగులో వేసిన ప్రశ్నకి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
ఘటాకాశం, మహాకాశం వేరు వేరా?
లంబకోణంలో ఊర్ధ్వంగా ప్రయాణిస్తే బ్రహ్మరంధ్ర విఛ్ఛిత్తి జరిగితే, ఘటం భిన్నమైతే, ఘాటాకాశం మహాకాశం లో కలుస్తుందా? కలిసినట్టనిపిస్తుందా? వివరించగలరు.
నా సమాధానం చదవండి. మరింత సమయం దొరికి ఉంటే ఇంకా విపులంగా వ్రాసేవాడినే. కాని ఇప్పటికే కొంచెం విస్తారమైపోయింది జవాబు. మీకు ఇదే కొంచెం పెద్దదైతే విసుక్కోవద్దని మనవి.
మణ్డలబ్రాహ్మణోపనిషత్తు అని ఒకటి ఉంది.
అక్కడ ఈ ఆకాశాల ప్రసక్తి కనిపించింది.
అథ హ యాజ్ఞవల్క్యో మణ్డలపురుషం పప్రచ్ఛ
వ్యోమపఞ్చకలక్షణం విస్తరేణానుబ్రూహీతి । స
హోవాచాకాశం పరాకాశం మహాకాశం
సూర్యాకాశం పరమాకాశమితి పఞ్చ భవన్తి ।
బాహ్యాభ్యన్తరమన్ధకారమయమాకాశమ్ ।
బాహ్యస్యాభ్యన్తరే కాలానలసదృశం పరాకాశమ్ ।
సబాహ్యాభ్యన్తరేఽపరిమితద్యుతినిభం తత్త్వం మహాకాశమ్ ।
సబాహ్యాభ్యన్తరే సూర్యనిభం సూర్యాకాశమ్ ।
అనిర్వచనీయజ్యోతిః సర్వవ్యాపకం నిరతిశయానన్దలక్షణం
పరమాకాశమ్ । ఏవం తత్తల్లక్ష్యదర్శనాత్తత్తద్రూపో భవతి ।
నవచక్రం షడాధారం త్రిలక్ష్యం వ్యోమపఞ్చకమ్ ।
సమ్యగేతన్న జానాతి స యోగీ నామతో భవేత్ ॥ ౧॥
ఇతి చతుర్థం బ్రాహ్మణమ్ ॥ ౪॥
క్లుప్తంగా చెప్పుకుందాము.
మండలపురుషుడు యాజ్ఞవల్క్యమహర్షితో చెబుతున్నాడు.
ఆకాశం వ్యోమపంచకం అని తెలుసుకోవాలి. (పంచకం అంటే ఐదురకాలుగా ఉన్నది. వ్యోమం అంటే ఆకాశం. అంటే space అన్నమాట.) ఆ ఐదు రకాలు ఏమిటంటే,
ఆకాశం
పరాకాశం
మహాకాశం
సూర్యాకాశం
పరమాకాశం
అనేవి.
ఆకాశము బాహ్యాభ్యన్తరమన్ధకారమయము. అనగా ఆకాశం బాహ్యమునందూ (అంటే బయటా) అంతరమందూ (తనలోనూ) అంధకారమయమైనది (చీకటి గుయ్యారమైనది) (ఇది కేవలం సైధ్ధాంతికం. ఆకాశాన్ని పరమాకాశం నిష్పన్నం చేసినప్పుడు, బీజస్వరూపమైన తన అంశను దానిలో కేవల ద్యుతిగా పరమాత్మ ప్రవేశింపజేయటానికి ముందుగా ఉన్న అత్యంత మూల స్వరూపమైన స్థలకాలాదులతో కూడిన ఆకాశస్థితి. ఏ ప్రకాశనతత్త్వమూ లేనిది కాబట్టి అంతా చీకటే అని చెప్పటం)
మహాకాశానికి బాహ్యమునందూ అంతరమందూ కూడా పరిమితమైన ద్యుతి (ప్రకాశం) ఉన్నది. (ఇది సృష్టికార్యానికి ముందునా, లయకార్యానికి పిమ్మటా ఉండే అత్యంత పరిమితమైన స్థలకాలాదులలో వ్యాపించి కేవలం పరిమితమైన అంటే బీజరూపమైన ద్యుతికలిగిన ఆకాశం)
సూర్యాకాశం అనేది బాహ్యములోనూ అంతరమందూ కూడా అపరిమితంగా సూర్యుడివలే వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. ( ఇది ద్యోతకమైన సృష్టిలోని ప్రకాశావరణస్వరూపమైన ఆకాశం అన్నమాట)
అంతకంటే తీవ్రాతితీవ్రంగా ప్రళయాగ్ని సమమైన ప్రభలు కలది పరాకాశం. (ఈ ఆకాశాన్ని ప్రకృతి యొక్క సృష్టిలయకార్యాలకు సంబంధించిన వేదికగా తీసుకొనవచ్చును)
ఇక పరమాకాశం. అది అనిర్వచనీయమైనది (అంటే మాటలతో చెప్పలేనిది. ఏ వర్ణనలూ దానిని సూచనామాత్రంగా కూడా చెప్పలేవు. ఏ ఉపమానాలూ పనికి రావు. అసలు దానిని దేనితోనూ పోల్చలేమి కాబట్టి). అది కేవలం జ్యోతి స్వరూపమైనది. (కేవలం జ్యోతి అనటంలో తాత్పర్యం అది స్వతఃసిధ్దమైన వెలుగు కలది కాని దేని వలనా దానికి ప్రకాశం రావటం లేదు అని చెప్పటం). అది సర్వవ్యాపకమైనది (అంటే దాని వ్యాపన శీలం చేతనే మిగిలిన ఆకాశస్వరూపాలు సిధ్ధించటమూ వాటివాటి ప్రకాశాలను వెలువరించటమూ అని ఒకటీ, అది లేని స్థలకాలాదులు లేవు కాబట్టి అది శాశ్వతమూ, అచ్యుతమూ ఐన స్వరూపం. అనగా భగవత్స్వరూపం అని చెప్పటం). అది కేవలం నిరతిశయానందమే తన లక్షణంగా కలిగి ఉంది. (నిరతిశయమైన ఆనందం కలది పరబ్రహ్మమే. పరమమైన ఆకాశస్వరూపం అదేను అని చెప్పటం తాత్పర్యం.
ఇక శర్మగారు పటాకాశం అని ప్రస్తావించారు. ఘటాకాశం, మహాకాశం వేరు వేరా? అంటూ.
అలాగే, అధ్యాత్మోపనిషత్తు అని ఒకటుంది. అక్కడా ఆకాశాల గురించిన ప్రస్తావన ఉంది.
ఆ ఉపనిషత్తు ప్రకారం,
యస్యాకాశః శరీరం య ఆకాశమన్తరే సంచరన్యమాకాశో న వేద|
అని. ఇక్కడ అకాశం ప్రసక్తి ఎలా వచ్చిందంటే,
అన్తఃశరీరే నిహితో గుహాయామజ ఏకో నిత్యమస్య
పృథివీ శరీరం యః పృథివీమన్తరే సంచరన్యం పృథివీ న వేద|
యస్యాపఃశరీరం యో అపోऽన్తరే సంచరన్యమాపో న విదుః|
యస్య తేజః శరీరం యస్తేజోऽన్తరే సంచరన్యం తేజో న వేద|
యస్య వాయుః శరీరం యో వాయుమన్తరే సంచరన్యం వాయుర్న వేద|
యస్యాకాశః శరీరం య ఆకాశమన్తరే సంచరన్యమాకాశో న వేద|
యస్య మనః శరీరం యో మనోऽన్తరే సంచరన్యం మనో న వేద|
యస్య బుద్ధిః శరీరం యో బుద్ధిమన్తరే సంచరన్యం బుద్ధిర్న వేద|
యస్యాహంకారః శరీరం యోऽహంకారమన్తరే సంచరన్యమహంకారో న వేద|
యస్య చిత్తం శరీరం యశ్చిత్తమన్తరే సంచరన్యం చిత్తం న వేద|
యస్యావ్యక్తం శరీరం యోऽవ్యక్తమన్తరే సంచరన్యమవ్యక్తం న వేద|
యస్యాక్శరం శరీరం యోऽక్శరమన్తరే సంచరన్యమ్క్శరం న వేద|
యస్య మృయుః శరీరం యో మృత్యుమన్తరే సంచరన్యం మృత్యుర్న వేద|
స ఏష సర్వభూతాన్తరాత్మాపహతపాప్మా దివ్యో దేవ ఏకో నారాయణః|
శరీరంలో ఉన్నది దివ్యుడు ఒకేఒకడు ఐన నారాయణుడే. అన్తఃశరీరే నిహితో గుహాయామజ ఏకో నిత్యమస్య అని చెప్పటంలో తాత్పర్యం, శరీరంలో అజుడూ (అంటే పుట్టువూ -చావూ లేని వాడు), ఆ కారణంగా నిత్యుడూ (దేశకాలావధులు లేక ఎల్లప్పుడు ఎల్లచోట్లా ఉండేవాడు) ఐన పరబ్రహ్మస్వరుపుడు నారాయణుడు నివసిస్తున్నాడు. పంచభూతాలైన పృధివీ, వాయువు, జలమూ, ఆకాశమూ, అగ్నీ అనేవీ, అంతఃకరణ చతుష్టయం అని చెప్పబడే మనోబుధ్యహంకారచిత్తములూ మొదలైన వన్నీ కూడా అ నారాయణుడు తనకు శరీరంగా చేసుకొని ఈ శరీరంలో ఉన్న ఆయా తత్త్వాలలో సంచరిస్తున్నాడు అని. అందుచేత ఇవేవీ నారాయణుని విభూతులకు అన్యం ఐనవి కావని మనం తెలుసుకోవాలి అని.
ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని|
విలాప్యాఖణ్డభావేన తూష్ణీం భవ సదా మునే|| 7 ||
ఇక్కడ ఘటాకాశం అంటే నిర్థిష్టమైన ఆకృతిలో ఇమిడి ఉన్న ఆకాశం అని. ఘటమందున్న అకాశం ఘటాకాశం అన్నమాట. ఇక్కడ ఘటం పాంచభౌతికమైనది. దానిరూపంలో కొంత ఆకాశం (space) బధ్దమై ఉంది. అంటే ఘటం అనేది అది ఉన్నంతకాలమూ కొంత స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇక్కడ ఘటం అన్నది ఏదన్న స్థూలరూపం కలది కావచ్చును. కుండ అని చెప్పటం ఒక ప్రతీకగా మాత్రమే.
మహాకాశం అంటే ఏ విధమైన పరిమితిలోనూ ఇమడ్చబడకుండా తనకు తానుగా ఉన్న నిత్యస్వరూపమైన ఆకాశం.
ఘటానికి నిత్యత్వం లేదు.
ఈ ఘటం అనేది ఒకప్పుడు ఉనికిలో లేనేలేదు.
ఉనికి లోనికి వచ్చింది ఎదైనా ఒకనాటికి ఆ ఉనికి కోల్పోవలసి రావటం సృష్టి ధర్మం.
ఎందుకంటే శాశ్వతత్వం అనేది కేవలం పరమాత్మవాచకమే కాని ఇతరత్రా ఆ మాట కుదరదు కాబట్టి.
మహాకాశం పంచభూతాలలో ఒకటి.
దాని ఉనికి శాశ్వతమా అంటే కాదు. నిజంగానే.
అది ప్రకృతిలో భాగం.
ప్రకృతి లయం ఐనప్పుడు దాన్ని మహాప్రళయం అంటాం.
అప్పుడు పంచభూతాలకు లయం చెందక తప్పదు.
ఐనా ప్రకృతిలోని భాగమైన మహాకాశంతో పోలిస్తే తాత్కాలికమైన ఉనికి గల ఘటాదుల ఉపాధి అత్యంత స్వల్పకాలావధి కలది. అది త్వరలోనే తన ఉనికి కోల్పోక తప్పదు కదా.
కాని ఉనికి కోల్పోయిన ఒక ఘటం ఏమైపోతోంది? దానికి ఆకృతిని ఇచ్చిన పంచభూతాల్లోనే దానికి సంబంధించిన సర్వమూ లీనమై పోతోంది. ఆ ఘటరూపంలో ఉన్న పంచభూతాల అంశలన్నీ ఎక్కడికి పోతున్నాయి?
ఎక్కడికీ పోవటంలేదు. అవి ప్రకృతిలోనే ఉంటాయి. ఇలా కూడిన అంశలు మరొక ఘటరూపంలో ఏర్పడుతూ ఉంటాయి. ఆయా ఘటాల పరిమాణాలలోనూ ఇతర భౌతికలక్షణాలలోనూ స్థూలమైన బేధాలు తప్పక కనిపించవచ్చును.
కాని అన్నీ సృష్టిలోని పంచభూతాదుల అంశల కూడికలూ తీసివేతల గారడీలే. ప్రకృతి మాత్రం అఖండంగా అలాగే ఉంటుంది.
ఈ అఖండభావం గ్రహించిన మునులు ఈ కూడికలూ తీసివేతలూ గమనిస్తూ వాటి గురించి ఏవిదమైన మనో వికారాలకూ (అంటే అయ్యో ఇది పోయిందే అది పోయిందే లాంటి శోకాలకూ, ఇది బాగుంది అది గొప్పగా ఉంది లాంటి స్వల్పసంతోషాలకూ) అతీతంగా ఉదాసీనంగా ఉంటారు.
లంబకోణంలో ఊర్ధ్వంగా ప్రయాణిస్తే బ్రహ్మరంధ్ర విఛ్ఛిత్తి జరిగితే, ఘటం భిన్నమైతే, ఘాటాకాశం మహాకాశం లో కలుస్తుందా? కలిసినట్టనిపిస్తుందా? వివరించమంటారు శర్మగారు.
ఘటం అన్నది శరీరానికి ప్రతీకగా తీసుకోవటం సరైనదే, ఇబ్బంది లేదు. ఘాటాకాశం మహాకాశం లో కలవటం అంటే శరీరంనుండి బ్రహ్మరంధ్రంద్వారా ఒక యోగి నిర్గమించిన తర్వాత సంగతి ఏమీ అంటున్నారు. శరీరమనే స్థూల వస్తువుతో యోగికి పనిలేదు. అందునా దానిని వదలిన తరువాత. శరీరంలో ఉండే యోగి నారాయణాంశతో ఉన్న అనంతసహస్రకోటిజీవుల్లో ఒకడే కదా. ఐతే తత్త్వమసీతి సత్యాన్నెఱిగిన వాడు. సః యాతి పరమాంగతిం అని అనుకోవాలి. ఆ యోగికి పునరావృతి లేదు. అలా పునరావృతి ఉన్నవాడికి బ్రహ్మరంధ్రనిర్గమనం లేదు.
శరీరమనే స్థూలవస్తువుకు సంబంధించినది అంతా (తద్ఘటాకాశంతో సహా) ప్రకృతిలో కలుస్తుంది. మహాకాశం దానిలో భాగమే. తిరిగి ఆ శరీరంలో ఇమిడి ఉన్న ప్రాకృతికమైన సర్వాంశలనూ ప్రకృతి పునర్వినియోగం (recycle) చేస్తుంది.
ఆ శరీరంలో వసించిన యోగి మాత్రం అలా ఏర్పడే మరొక ఉపాధిలోనికి రావలసిన అవసరం కలిగి ఉండడు.