అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక
నిఖిలాగమస్తుత నిర్వాణదాయక
దేవదేవ నీదు దివ్యప్రభావంబు తెలియంగ నేనెంతవాడ
నీవంకకే కాని ఏవంకకును బోక నిలువంగ లేకున్న వాడ
ఏ విధానమున నిన్నెడబాయని భక్తి భావంబు నిండించు వాడ
నేవే కటాక్షించి నా జాలి పరికించి కావుమా కోనేటి రేడ ॥అఖిలాండ॥
తలపులన్నీ నీకు ధారపోయుదు నని తహతహ లాడేను కాని
యిలలోని గొడవలు తలలోన కలబడి తలపులు కలుషితమ్మైన
జలజాక్ష నీదివ్య చరణసరోరుహముల మ్రోల నుంచగా లేని
తులువను జాలితో తిలకించి నీదయ నొలికించుమా చక్రపాణి ॥అఖిలాండ॥
శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని మూడు మారులు పలికెడు లోన
మారుద్రోవలుద్రొక్కి మసలుచుండును నాదు మనసన్న జానకీజాని
ఈ రీతి గడిచిన వెన్ని జన్మంబులో యిల నిట్లు తిరుగుటే కాని
వేరు మార్గములేదు నీవె జాలిని చూపి ఆరాటమును తీర్చవేని ॥అఖిలాండ॥