23, ఫిబ్రవరి 2015, సోమవారం

దొరికిన దొంగ!



ఒక ఎఱ్ఱచందనం స్మగ్లర్ మహాశయుణ్ణి పట్టుకున్నారు.
సంతోషం.

అలాంటి ఇలాంటి స్మగ్లర్ కాదండి.
ఎఱ్ఱచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాధినేత గంగిరెడ్డి అంటే యావన్మందికీ తెలుస్తుంది.
అంత ప్రసిధ్ధుడు
ప్రబుధ్ధుడు.

ఇంకా పూర్తి కథనం తెలుసుకోలేదు నేను.
వార్తలు వినాలి వీలుంటే పదింటికి.

సరే, ఒక బడాబడా స్మగ్లర్ని పట్టారండీ.
ఇప్పుడేం జరుగుతుంది?

ఆయన్ని (గౌరవంగా సంబోధించాలి మరిచిపోరాదు, ఎంత బడాదొంగైతే అంత గొప్ప గౌరవం మరి మనదేశంలో)  వేగిరం శిక్షించగలవా మనం‌ చట్టమూ‌ న్యాయమూను?

బహుశః ఏం‌జరుగుతుందో ఆలోచిద్దాం ఒకసారి.



  • అతగాడికి హఠాత్తుగా ఆరోగ్యసమస్యలు ఎదురౌతాయి.
  • బోలెడు వైద్యపరీక్షలు జరుగుతాయి.
  • అతడు అత్యంత ఉదారుడూ, యోగ్యుడూ, సజ్జనుడూ అని బందుమిత్రులు మీడియాలో గోలచేస్తారు.
  • ఆయన కొన్నాళ్ళు పోలిసు కాపలాతో ఐదు నక్షత్రాల స్పెషాలిటీ ట్రీట్‌మెంట్ సౌకర్యాలతో కాలక్షేపం చేస్తారు.
  • మేజస్ట్రీట్ గారు వారమో పద్నాలుగురోజులో‌ కష్టడీకి ఇస్తారు పోలీసులకు.
  • ఛార్జిషీట్లు ఫైల్ కావటానికే చాలా నెలలు బహుశః సంవత్సరం ఐనా పట్టవచ్చును.
  • ఆ ఛార్జిషీటు బాగోలేదనో అసమగ్రంగా ఉందనో కోర్టువారు కోప్పడితే మనం విని ఆనందించవచ్చును. మళ్ళా సరిగ్గా ఫైల్ చేయమని ఆదేశించవచ్చును.  దానికి బోలెడు గడువూ ఇవ్వవచ్చును.
  • అందాకా జైలులో రాజభోగాలు కావాలని ఆయన అడగటమూ, అత్యంత ఉదారంగా న్యాయస్థానాలు వాటిని అమోదించటమూ జరుగుతుంది.
  • రాజభోగాలు జరుగుతూ ఉండగానే బెయిల్ ప్రయత్నాలు జరుగుతాయి
  • వాటికి  కొన్ని వైఫల్యాలూ వగైరా కలుగుతాయి ప్రాసిక్యూషన్ వారు తీవ్రంగా అభ్యంతరాలు చెప్పటం వలన.
  • కొందరు రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళి మరీ మంతనాలు జరుపుతే అశ్చర్యపోవద్దు మనం.
  • ఈ లోగా ఈడీ వారు కొన్ని కొన్ని ఆస్తులని ఆటాచ్ చేస్తారు.  అబ్బే ఎంత లేసి లెండి. కొండమీద దండెత్తి ఒకటి రెండు బండరాళ్ళు మోసుకు పోయినంతగా. అంతే.
  • మీడియాలో దానిపై నిరసనలు వెల్లువెత్తుతాయి సానుభూతిపరుల నుండి.
  • సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు స్మగ్లర్ గారు నిర్దోషిని నాపైన వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు కొట్టేయండీ అని.
  • చివరికి రాం జెట్ మలానీగారు రంగంలో‌ దిగి ఆ మహాత్ముడు విడుదల కావాలీ అని అన్ని బల్లలూ గుద్ది వాదిస్తారు.
  • బెయిల్ ఇవ్వటానికి తమకేమీ అభ్యంతరం లేదని ప్రాసిక్యూషన్ వారు న్యాయస్థానానికి చెబుతారు.
  • చిద్విలాసంగా స్మగ్లర్ గారు విడుదల అవుతారు.
  • కేసు కొనసాగుతూనే ఉంటుంది.
  • ప్రాసిక్యూషన్  మరింత గడువు అడుతుతూ‌ ఉంటుంది ఎప్పటి కప్పుడు
  • కోర్టు మండిపడుతూ ఉంటుంది యథాప్రకారంగా, కానీ మళ్ళా మళ్ళా గడువులు ఇస్తూనే ఉంటుంది.
  • ముఖ్యసాక్షుల మరణాలు - అందులో కొందరివి అనుమానాస్పదం అని జనం చెవులు కొరుక్కోవటం జరుగుతుంది.
  • ఆయన జీవిత చరిత్ర పుస్తకాలుగా వ్రాసి కొందరు రచయితలు సొమ్ములు చేసుకుంటారు.
  • ఆయనకి కూడా అసంతృప్తి కలిగి, తానే ఒక ఆత్మకథ వ్రాస్తే అది బెష్ట్ సెల్లర్ గా ఏడాది పైనే నడుస్తుంది.
  • ఆయనపై తెలుగు సినిమా తీస్తున్నారన్న వార్త గుప్పుమటుంది.
  • హీరో ఎవరూ ఆపాత్రలో? ఎవరు బాగుంటారూ అని సినీ అభిమానుల చర్చలు మీడియాలో సోషల్ మీడియాల్లో!
  • ఈ కేసు ఎటుపోతోందీ‌? తేల్చండీ అని మేథావుల వ్యాసాలు మీడియాలో వస్తాయి.
  • ఈ లోగా ఎన్నికలు వస్తాయి.  ఎందుకు రావూ? ఇలాంటి ఛోటామోటా కారణాలకు ఎన్నికలు ఆపుతారా మరి?
  • ఈ‌యన సపోర్టుకోసం కూడా ఇండైరెక్టుగా చాలా మతలబులు నడుస్తాయి.
  • అందులో‌ కొన్నింటిమీద టీవీ ఛానెళ్ళవాళ్ళు ఎక్లూజివ్ కవరేజీలూ ఇస్తారు.
  • కేసు అలాగే కాగితాలమీద నిద్దరపోతూ ఉంటుంది.
  • ఆయన బెయిల్ పైన అనంతకాలం హాయిగా ఉండనే ఉంటాడు.
  • అన్నట్లు ఎఱ్ఱచందనం స్మగ్లింగ్ ఎందుకు ఆగటం లేదో తేల్చండీ అని,  అన్ని రాజకీయపక్షాలూ ఏమీ ఎరగనట్లు అరుస్తూ ఉంటాయి.
  • షరామామూలుగా జనం కొత్తకొత్త సెన్సేషనల్ వార్తల కోసం చూస్తూ ఈ వ్యవహారాన్ని పట్టించుకోరు.
  • సరే, ప్రభుత్వాలూ పట్టించుకోవు, కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు,  ప్రజలకు లేని ఆసక్తి మనకెందుకూ‌ అని. 

అంతేనంటారా?
వేరేగా ఏమన్నా జరిగి శిక్షపడిపోతుందా అతగాడికి?
కాలమే చెప్పాలి.