15, డిసెంబర్ 2014, సోమవారం

పాపఫలం


రామాలయం దగ్గర పెద్దగా హడావుడి ఉండదు. సుమారు ఎనభై సంవత్సరాల క్రిందట ఆగుడి కట్టినప్పుడు  భక్తుల రాక బాగానే ఉండేదట. కాలక్రమంలో అది గణనీయంగా పడిపోయింది. నిత్యం రెండుపూటలా గుడికి వచ్చేది కేవలం అర్చకులవారే. కొందరు  పెద్దలు మాత్రం సాయంకాలం  పూట గుడికి వస్తూ ఉంటారు.

ఆ రోజున మాత్రం ఒక విశేషం‌ జరిగింది. సూర్యోదయం వేళకే అర్చకులవారూ ఆయన మనవడూ పూజాద్రవ్యాలతో ఆలయం దగ్గరకు వచ్చేసరికి అంతకన్నా  ముందుగానే ఎవరో ఒకాయన వచ్చి ఆలయం ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చున్నారు. అర్చకులవారు గాని ఆయన మనవడు కాని పట్టించుకోలేదు.  అప్పుడప్పుడూ దారినబోయేవాళ్ళూ బిచ్చగాళ్ళూ ఆ మంటపంలో దర్శనం ఇస్తూనే ఉంటారు కాబట్టి యీ వచ్చిన వారు ఎవరని ఆరా తీయవలసిన అవసరం కనబడలేదు వారికి.

పదకొండు గంటలకి గుడి తలుపులు మూసి అర్చకులవారు ఆలయం బయటికి వచ్చారు. ఆయన ఒక్క  కేక పెట్టేసరికి ఆయన మనవడూ ఉద్యానవనవిహారం చాలించి తాతగారిముందు ప్రత్యక్షం అయ్యాడు.

ఇంకా మంటపంలో తిష్టవేసిన మనిషి అక్కడే ఉన్నాడు. ఉదయం ఎక్కడ కూర్చుని ఉన్నాడో అక్కడే అలాగే కూర్చుని ఉన్నాడు. ఒక్కటే తేడా.  ఇప్పుడు మంటపంలో ఎఱ్ఱటిఎండలో కూర్చుని ఉన్నాడు. తాతామనవళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగింది.  ఈసారి ఆయనమీద తగినంత గౌరవభావమూ కలిగింది.

దగ్గరకు వెళ్ళి పలకరించారు అర్చకులవారు.

సమాధానం లేదు. ఆయన ఉలకలేదు పలకలేదు.

కొంచెంసేవు పలకరించటానికి ప్రయత్నించి విఫలం అయ్యాక దేవుడి ప్రసాదం కొంత ఆయన సన్నిధిలో ఉంచి వెనుదిరిగారు.

'ఎవరో మహానుభావుడు. మన ఊరి గుడిలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు ' అన్నారు అర్చకులవారు మనవడితో ఇంటికి నడుస్తూ.

సాయంకాలం అయ్యాక తాతామనవళ్ళు తిరిగి గుడికి వచ్చారు. ఉదయం మంటపంలో ధ్యానంలో ఉండి కనిపించిన కొత్త ఆయన ఇప్పటికీ అలాగే కూర్చుని ఉన్నారు. ఆయన ఎదురుగా ఉంచిన ప్రసాదపాత్ర అలాగే ఉంది ప్రసాదంతో సహా.

తాతామనవళ్ళకి పరమాశ్చర్యం అయింది ఈ సారి.

ఆయన్ను పలకరించటానికి కూడా  ఇద్దరికీ సాహసం చాల లేదు.

అర్చకులవారు గుడి తలుపులు తీస్తూ, 'ఈ సంగతి కరణంగారికి చెప్పిరా 'అని మనవణ్ణి పంపారు.  అంతకంటే ఏమి చేయాలో ఆయనకు తోచలేదు.

చీకటి పడే లోగా ఆలయం ముందు ఒక పెద్ద తీర్ధం తయారయింది. పిల్లామేకాతో సహా మూడువంతుల ఊరు గుడిముందు ప్రత్యక్షం అయింది.

ప్రతిరోజూ చేసేటట్లుగానే ఆరోజు ఏడున్నరకే గుడితలుపులు మూయలేదు అర్చకులు. మూసేవారే నేమో.  కాని ఏడుగంటల ప్రాంతంలో ఎవరో వచ్చి సాధువుగారు కొంచెం కదిలారన్న వార్త చెప్పారు. దానితో అంతా  ఎదురుచూస్తూ కూర్చున్నారు.

ఇంచుమించు  ఎనిమిదిగంటల ప్రాంతంలో మంటపంలోని పెద్దమనిషి నిజంగానే కళ్ళుతెరిచి చుట్టూ చూసారు. చుట్టుపక్కల జనమే జనం.  ఆయన వారినేమీ పట్టించుకోకుండా తిన్నగా దైవదర్శనానికి నడిచారు.

కొందరు కాళ్ళమీద పడబోయారు కాని ఆయన అడ్డంగా తలతిప్పి వారించటంతో తగ్గారు.

దైవదర్శనం చేసుకుని ఆయన మళ్ళా మంటపంలో కూర్చున్నారు.

ఈ సారి ఊరిపెద్దలు కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళి నమస్కరించబోయారు.

'తప్పు. దైవసాన్నిధ్యంలో మరెవరికీ నమస్కరించరాదు.' అన్నా రాయన వారిని వారించి.

ఊరిపెద్దలు ఎంతో వినయంగా స్వామీ మీ గురించి చెప్పండి అని అడిగారు.  అయన ఒక్క నిముషం మౌనంగా ఉండి పోయాడు. తరువాత మృదువుగా  'ఈ రోజు నవమి కదా! పౌర్ణమినాటి ఉదయం చెబుతాను నా గురించి' అన్నారు. 'రాత్రి యీ‌ మంటపంలోనే పడుకుంటాను , ప్రొద్దుపోయింది మీరంతా వెళ్ళిరండి' అని కూడా అన్నారు.

కరణంగారు పాలూ ఫలహారమూ పంపిస్తానంటే సాధువుగారు చిన్నగా నవ్వి, తల అడ్డంగా ఊపారు.

ఆ రోజు జరిగిన విశేషం గురించి ముచ్చటించు కుంటూ అందరూ ఇళ్ళకు మళ్ళారు.

ఎన్నడూ లేనిది మర్నాడు ఊరు ఊరంతా గుడికి వచ్చింది. వాళ్ళంతా రాములవారి దర్శనానికి వచ్చారని చెప్పటం‌ కన్నా సాధువుగారి దర్శనానికి వచ్చారని చెప్పటమే సరిగా ఉంటుంది.

సాధువుగారి గురించి న వార్త చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా దావానలంలాగా వ్యాపించింది. గుడి చరిత్రలో ఎన్నడూ లేనంత మంది జనం వస్తున్నారు ఉదయాస్తమయాలు. సాధువుగారు ఎవరినీ పట్టించుకోకుండా మంటపంలోనే కూర్చుంటున్నారు.  అహారమూ నీళ్ళూ ఏమీ‌ అవసరం లేనట్లున్నాయి  ఆయనకు. జనం మాత్రం ఎంతో క్రమశిక్షణగా మౌనంగానే అయన దర్శనం చేసుకుని వెడుతున్నారు.

పౌర్ణమి వచ్చేలోగానే ఊరిపెద్దలు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సాధువుగారు సరేనంటే ఆయనకు ఒక ఆశ్రమం కట్టించి ఇవ్వటానికి ఊళ్ళో ఒక్కరు కూడా అభ్యంతరం  చెప్పలేదు.

పౌర్ణమి రానే వచ్చింది. ఆ రోజు ఉదయం‌ గుడి ప్రాంగణం జనసముద్రమే అయింది.

మళ్ళా కరణంగారు మునసబుగారు మొదలైన ఊరిపెద్దలంతా సాధువుగారిని స్వామీ తమగురించి నేడు చెబుతానన్నారు అని సవినయంగా గుర్తు చేసారు.

'ఈ రోజున పౌర్ణమి.  క్షురకర్మ చేయించుకో వలసిన దినం.'  అని సాధువుగారు చుట్టూ చూసారు. జనం మధ్యలో ఉన్న ఒక ఆసామీని  పేరు పెట్టి పిలిచారు 'నాకు క్షవరం చేయాలి రావోయ్' అని.

సాధువుగారు సర్వవేది అని జనం అంతా మహదానందం పొందారు.  రమారమి అరవైయేళ్లప్రాయంలోని ఊరి క్షురకుడు ఒకాయన ముందుకు వచ్చి నమస్కరించి 'మహా భాగ్యం' అన్నాడు.  సాధువుగారు నవ్వి పద అన్నారు.

గుడి పక్కనే ఉన్న కోనేటి గట్టున సాధువుగారికి క్షురకర్మ జరిగింది. సాధువుగారు స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చారు. వెనుకనే క్షురకుడు.

చెప్పరానంత కోలాహలం చెలరేగింది.

కొందరి చేతుల్లో కఱ్ఱలూ పైకి లేవటం‌ జరిగింది.

అర్చకులవారైతే నోట మాట రాక రాయిలా నిలబడిపోయారు.

సాధువుగారు యథాప్రకారం మంటపంలో కూర్చుని చుట్టు ఒకసారి చూసారు.

'పెద్దలూ, ఊరిప్రజలూ అంతా  నేను ఎవరినో గ్రహించారు కదా!' అని చిరునవ్వు నవ్వారు.

అక్కడ ఉన్నవాళ్ళంతా తమలో తాము గుంపులుగుంపులుగా గడబిడగా చర్చించుకోవటం మొదలు పెట్టారు.

ఉన్నట్లుండి జనం మధ్యలోనుండి ఎవ్వరో 'కరణంగారూ పోలీసులను పిలవండి' అని పెద్దగా అరిచారు.

సాధువుగారు కులాసాగా నవ్వారు. 'పిలవండి. వద్దన్న దెవరూ' అన్నారు.

ఆ మాటతో అక్కడ సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం ఏర్పడింది.

మెల్లగా ఆలయం అర్చకులవారు  మంటపం వద్దకు వచ్చారు.

'నువ్వా  హనుమంతూ! ఎన్నాళ్ళకి తిరిగి వచ్చావూ!  నువ్వనే అనుకోలేదు సుమా! స్వాములవారివి ఎలా అయ్యావూ? ఇదంతా ఏమిటీ?' అన్నారు  విస్మయంగా.

'అర్చకులవారూ, హనుమంతు అనేది నా పూర్వనామం' అని సాధువుగారు చిరునవ్వు నవ్వారు.

కరణంగారు అయోమయంలో ఉన్నారు. సాధువుగారు చేయెత్తి, కరణంగారిని దగ్గరకు రమ్మని పిలిచారు.  కరణంగారు వచ్చారు.

'అమ్మ పరిస్థితి ఎలా ఉంది' అన్నారు సాధువుగారు.

కరణంగారు మాటల కోసం వెదుక్కుంటున్నారు.  సాధువుగారు చిరునవ్వు నవ్వారు. 'నాకు తెలుసు ఆ సంగతి' అని  మెల్లగా కొంచెం విచారంగా అన్నారు.

'అమ్మ నన్ను ఒక్క సారి చూసి కళ్ళు మూయాలని ఆశపడుతోంది.  నేను ఊళ్ళో కాలు పెడితే పోలీసులు పట్టుకు పోతారని ఆవిడకు భయమూ‌ బెంగాను .  అవునా?' అన్నారు.

కరణంగారు తల ఊపారు.

రోజూ అందర్నీ గదమాయించి మాట్లాడే కరణం గారు మన్నుతిన్న పాములా అలా మందకొడిగా ఎలా ఉన్నారో  అని జనం అనుకోలేదు. 'ఇప్పుడు మేనల్లుణ్ణి పోలీసులు పట్టు కెడతారని జంకుతున్నాడు, చూస్తున్నారా ' అని అనేకులు చెవులు కొరుక్కున్నారు.

అప్పటికే  ఎవరెవరో పోలీసులకు  వర్తమానం అందించటం జరిగింది.

సాధువుగారు మంటపం దిగి కరణంగారి చేయి పట్టుకున్నారు.  'పదండి అమ్మని చూడాలి'  అన్నారు.

ఎవరో యువకుడు అరిచాడు 'ఎక్కడికి వెళ్ళేది? పోలీసులు వస్తున్నారు' అన్నాడు.

సాధువుగారు నవ్వి మళ్ళీ మంటపం లోనికి పోయి కూర్చున్నారు.

రెండు సందుల అవతల ఉన్న పోలీసుస్టేషను నుంచి పోలీసులు ఎంతసేపట్లో రావాలీ? నిముషాల మీద వచ్చారు జీపు  వేసుకుని.

అక్కడ ఉన్న జనంలో అనేకు లైతే ఇలాంటి వాణ్ణి  ఏదో పెద్ద సాధువు అనుకొని బ్రహ్మరథం పట్టామే అన్న అపరాథభావనలో ఉన్నారు.  కొందరైతే ఈ దొంగసాధువుని పోలీసువాళ్ళు సంకెళ్ళు వేసి పట్టుకుని వెళ్ళవలసిందే అన్న పట్టుదలతోఉన్నారు.  కొందరైతే ఏదో ఉంది, మనకు సరిగా అర్థం కావటం‌లేదు అని తలలు పట్టు కుంటున్నారు.

పోలీసు ఇనస్పెక్టరు కూడా అలాగే అనుకున్నాడు జరిగినదంతా  ఊరిపెద్దల ముఖతా తెలుసుకుని.

సాధువుగారు ఇనస్పెక్టరు తనకు కొంత గౌరవం ఇచ్చి మాట్లాడటం చూసి  అడిగాడు, 'అంతా నన్ను దొంగ అంటున్నారు కదా? మీరు నాతో ఏమీ దురుసుగా మాట్లాడటం లేదే వింతగా ఉందీ' అని.

ఇనస్పెక్టరు విస్తుపోయాడు. 'మీరు మీ నిర్దోషిత్వం ఋజువు చేసుకోవాలని వచ్చారని నా కనిపిస్తోంది. స్వయంగా మిమ్మల్ని మీరు వెల్లడించుకుని పోలీసులకు పట్టుబడటానికి సిధ్ధం కావటం వెనుక ఇదే కారణం కాకపోతే మరేమిటీ?' అన్నాడు.

సాధువుగారు చిరునవ్వు తో చూసారు ఇనస్పెక్టర్ని. 'అమ్మ కోరిక తీర్చవలసి ఉంది. లేకపోతే రావలసిన పని లేదు' అన్నాడు.

ఇనస్పెక్టరు అనుమానంగా అడిగాడు 'మీ రెక్కడ ఉన్నదీ‌ మీ అమ్మగారికి తెలుసుకదా?  ఆవిడ కబురు పెడితే వచ్చారు కదా?'

సాధువుగారు తల అడ్డంగా ఆడించారు. 'మా అమ్మ నాకు కబురు చేయటం ఎలా కుదురుతుందీ? అదీ కరణంగారికి తెలియకుండా? కరణంగారికి తెలిస్తే నన్ను ఎప్పుడో పట్టించే వారు కదా?' అన్నారు.

సాధువుగారు మళ్ళీ అన్నారు 'ఐనా అమ్మ కబురుపెడితే  చూడాలని వచ్చినవాడినైతే గుట్టుచప్పుడు కాకుండా చూసి వెళ్ళలేనా? నా అంతట నేనే వచ్చాను, నాకు తోచినట్లే చేస్తున్నాను.'

ఇనస్పెక్టరు బుఱ్ఱ గోక్కున్నాడు.

సాధువుగారు స్థిరంగా అన్నారు 'ముందు మా అమ్మగారిని చూడాలి.  ఆ తరువాత, కావలిస్తే మీరు నన్ను అరెష్టు చేసుకోవచ్చును'.

ఇనస్పెక్టరు ఒప్పుకోలేదు. 'మిమ్మల్ని అరెష్టు చేస్తున్నాం. మీరు మీ అమ్మగారిని చూడా లనుకుంటే కోర్టువారి అనుమతితో అలాగే చేయవచ్చును' అన్నాడు.

సాధువుగారు నవ్వారు. 'అంత తతంగం అవసరమా? మీరు నన్ను  స్టేషనుకు తీసుకుని వెళ్ళాలంటే కరణంగారి ఇంటి మీదుగానే కదా జీపు వెళ్ళేదీ? మీరే స్వయంగా నన్ను మా అమ్మగారికి చూపించి తీసుకొని వెళ్ళండి' అన్నారు.

కొంత తర్జనభర్జన జరిగింది. ఆశ్చర్యం ఏమి టంటే కరణంగారే సాధువుగారి ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. 'ఇప్పుడావిడ చివరిదశలో ఉంది. ఇతణ్ణి చూసి మరింత క్షోభపడటం తప్ప మరేమి ఒరుగుతుంది ఆవిడకి? హనుమంతును తీసుకుపొండి. ఈ భ్రష్టుణ్ణి మా అక్కకి చూపించ నవుసరం లేదు 'అని భీష్మించుకుని కూర్చున్నాడు.

చివరికి ఇనస్పెక్టరు సాధువుగారి వైపే మాట్లాడాడు. 'ఇవాళ కాకపోతే రేపు ఆవిడకి తెలిసి బాధపడదా,  ఊళ్ళో కొచ్చిన కొడుకుని కనీసం కళ్ళారా చూసుకోలేకపోయానని? మేము ఆవిడకి చూపించే తీసుకుని వెళతాం లెండి' అన్నాడు.

కరణంగారి ఉక్రోషం కట్టలు తెంచుకుంది. 'ఈ హనుమంతూ మీరూ క్లాస్‌మేట్లై ఉంటారు.  అందుకే వాడి వైపు మాట్లాడుతున్నారు' అన్నారు.

చివరికి సాధువుగారిని  సంకెళ్ళు వేయకుండానే జీపెక్కించుకుని ఇనస్పెక్టరు కదిలాడు.  అక్కడున్న వాళ్ళంతా ఊరేగింపుగా జీపు వెనకాలే వెళ్ళారు ఏం జరుగుతుందో చూద్దామని.

కరణంగారి ఇంటి చుట్టు దిట్టంగా పోలీసు పహారా ఏర్పాటు చేయబడింది. నలుగురు కానిస్టేబుళ్ళతో కరణంగారి ఇంటిలోనికి వెళ్ళాడు ఇనస్పెక్టరు. జబ్బుగా ఉన్న ముసలావిడ హనుమంతు తల్లి ఉన్న గదికి ఒకటే ద్వారం ఉంది. బయట కానిస్టేబుళ్ళని ఉంచి ఇనస్పెక్టరు సాధువుగారితో సహా ఆవిడ గదిలోనికి వెళ్ళాడు.  ఇనస్పెక్టరుతో పాటు ఆలయ ధర్మకర్తగారు కూడా లోపలికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే, కరణంగారూ వాళ్ళతో పాటే వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళకుండా బయటే ఉండి పోయారు.

ముసలావిడ కొడుకుని చూసి చాలా సంతోషించింది.

ఐతే, కొడుకు వెంట పోలీసులు వచ్చారని తెలిసి హతాశురాలైంది.

కొడుకు తల్లిని ఓదార్చకుండా ఉండలేడు కదా. "అమ్మా, నా చేతుల్లో కన్ను మూయాలని కలవరించావు. నేను  ఇప్పుడు సన్యాసిని. ఆసంగతి నీకు తెలియదు. కాని నీ కోరిక నా మనస్సుకి తెలిసింది. అందుకే నీ ఆశ తీర్చాలని వచ్చాను. అందరూ అనుకుంటున్నట్లు నేను దేవుడి నగలు దొంగిలించి పారిపోలేదు.  నన్ను దొంగని చేసి, జైలు పాలు చేసి, నీకు నాన్నగారి ద్వారా సంక్రమించిన నాలుగెకరాలూ స్వాధీనం చేసుకోవాలని మావయ్యే ఈ‌ ఎత్తు వేసాడు. గుళ్ళో దేవుడి నగలు తెచ్చి నీ సందుగుపెట్టెలో దాచాడు. నా మాట ఎవరు నమ్ముతారు? మావయ్య కట్టు కథలు చెప్పి పోలీసుల దృష్టిలోనూ‌జనం దృష్టిలోనూ నన్ను దుష్టుణ్ణీ దొంగనీ చేసాడు. ఎదిరించి నిలచే వయసూ సామర్థ్యమూ లేని నేను ఊరు వదిలి పారిపోయాను. సన్యాసి వేషం వేసుకుని ఊళ్ళు పట్టుకుని  తిరిగాను, కనిపించిన గుడికల్లా వెళ్ళి నా నిర్దోషిత్వాన్ని ఋజువు చేయమని దేవుణ్ణి వేడుకున్నాను కొన్నాళ్ళు. చివరికి  సన్యాసం స్వీకరించాను. అదంతా వేరే పెద్దకథ.  టూకీగా  చెప్పాలంటే,  ఆ రోజుల్లో ఒక స్వాములవారు నన్ను మందలించి వెంట తీసుకొని వెళ్ళారు.  అనంతర కాలంలో ఆయనే నాకు శిక్షణ నిచ్చి సన్యాసమూ ఇచ్చారు. ఇప్పుడు నీ‌కోరిక తెలిసి వచ్చాను."

ముసలావిడ గుండెలు బాదుకుంది.

ధర్మకర్తగారు తెల్లబోయారు. కరణం ఇలాంటి వాడని ఆయన ఊహకు కూడా ఎప్పుడూ అందలేదు మరి.

ఇనస్పెక్టరు కరణంగారి పాత్ర గురించి వచ్చిన అభియోగం విని విస్తుపోయాడు. "మీ‌ మాటలకి  ఆధారం ఏమిటీ" అని అడిగాడు.

స్వాధువుగారు చిరునవ్వు నవ్వారు.

తల్లి ఆర్తిగా అడిగింది 'అవున్నాయనా, మనం దొంగలం కాదని నిరూపించుకోవాలి కదా' అని.

సాధువుగారు చిరునవ్వు నవ్వి  'కరణంగారు దేవుడి నగల దొంగతనం నా మీద వేసినా, లోభం కొద్దీ వాటిల్లో చాలా వాటిని తానే దాచేసుకున్నాడు. జనం నేను వాటితో పారిపోయాననుకున్నారు. కరణంగారు వాటిని దాచటానికి  పాపం చాలా అవస్థపడ్డారు. వాటిని అమ్మటానికి కాని కరిగించటానికి కాని బయటకు తీస్తే దొరికిపోతాననే భయంతోఆ సాహసం చేయలేక పోయారు. తిరిగి గుడికి చేర్చే  దారీ తోచలేదు, బుధ్ధీ పుట్టలేదు. ఇన్నాళ్ళూ    నిధికి పాములాగా ఆయన వాటికి కాపలా కాస్తూ ఉండిపోయారు. నన్ను ముంచటానికి ఆయన దొంగ అవతారం ఎత్తితే, ఆ పాపఫలం కారణంగా, ఆయన పెద్దకొడుకు దుర్వ్యసనాలపాలై ఆయన్నే ముంచటానికి నిన్న ఆ నగలను దొంగిలించి పారిపోయాడు. ఈ ఉదయమే , పోలీసులకు దొరికిపోయాడు అవి అమ్మబోతూ. ఇప్పుడు పట్నం నుంచి సర్కిల్‌గారు ఆ పుత్ర రత్నాన్ని జీపులో ఇక్కడికే తీసుకుని వస్తున్నారు' అన్నారు.

ఇంతలో బయట పెద్ద కోలాహలం వినిపించింది. ఒక కానిస్టేబుల్ తలుపు కొద్దిగా తోసి సర్కిల్‌గారి రాకని తెలియబరిచాడు ఇనస్పెక్టరుకి.

ఇనస్పెక్టరు అప్రతిభుడైపోయాడు ఒక్క నిముషం పాటు. తరువాత గబగబా బయటకు వెళ్ళాడు.

సాధువుగారి తల్లి ముఖం వికసించింది. 'నాయనా నింద నుండి బయట పడ్డాం. ఇంక ఇక్కడే ఉండిపోరాదూ' అంది.

సాధువుగారు తల అడ్డంగా ఆడించి ఇలా అన్నారు. 'అమ్మా. సన్యాసికి బంధాలు ఉండరాదు. గుర్వాజ్ఞప్రకారం నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. నీకు ఇంకా ఆరేడు సంవత్సరాలు ఆయుర్దాయం ఉంది. మావయ్య మిగతా కొడుకులూ, కూతుళ్ళూ  చాలా యోగ్యులు. నిన్ను బాగా చూసుకుంటారు. నేను వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వు' అన్నాడు.

ఆవిడ  స్థిరంగా 'నువ్వు రాకుండా నా ప్రాణం  పోదు నాయనా' అన్నది.

సాధువుగారు నవ్వి 'అలాగే నమ్మా' అన్నాడు. మళ్ళా ధర్మకర్తగారి వైపుకి తిరిగి 'మీరు కరణంగారి దగ్గరకు వెళ్ళండి. ఆఖరుక్షణాల్లో మీతో ఆయన చెప్పా లనుకుంటున్న  మాటలున్నాయి.' అన్నాడు.

ధర్మకర్తగారికి అయోమయంగా అనిపించింది. కాని తొందరగానే తెప్పరిల్లి గబగబా బయటకు నడిచాడు.

బయటకు వెళ్ళిన ఇనస్పెక్టరుకు, బేడిలతో దర్శనం ఇచ్చిన పెద్దకొడుకుని చూడగానే గుండెపోటు వచ్చి పడిపోయిన కరణంగారు కనిపించారు.

కరణంగారిని హుటాహుటిని పెద్దాసుపత్రికి తరలించారు.

ఈ కోలాహలం ముగిసి సాధువుగారి కోసం సర్కిలూ, ఇనస్పెక్టరూ ముసలమ్మగారి గదిలోకి వెళ్ళారు. కాని అక్కడ ఆయన లేడు. 'బయటకు వెళ్ళాడు  బాబూ మీ వెంబడే' అని ముసలమ్మగారు చెప్పింది ఇనస్పెక్టరుతో.

కాని ఆ సాధువుగారు  అసలు గది బయటకు రావటమే ఎవరూ చూడలేదు.

(ఇది లోగడ జనవిజయం‌బ్లాగులో ప్రచురితమైన కథ)