6, అక్టోబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 12 త్వదీయం సౌందర్యం ....




మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


12

త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించిప్రభృతయః .
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్

ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క సాటిలేని సౌందర్యం గురించి ప్రస్తావిస్తున్నారు.

తుహినము అంటే మంచు. గిరి అంటే కొండ అని మనకు తెలుసు కదా. అందుచేత తుహినగిరి అంటే మంచుకొండ అనగా హిమవంతుడు. ఆయన యొక్క కన్య ఇంకెవరు, పార్వతీ అమ్మవారు. అసలు పార్వతి అన్నమాటకు అర్థం పర్వతం యొక్క కూతురు అనే కదా.

అలాగే ఈ శ్లోకంలో విరించి ప్రభృతయః అని బ్రహాదులను ప్రస్తావిస్తున్నారు. విరించి అంటే బ్రహ్మ అని అందరికీ తెలిసే ఉంటుందనుకుంటాను. విరించి ప్రభృతులు అనటం వల్ల ఆయనతో పాటు ఇతర దేవముఖ్యులనూ అంటే ఇంధ్రాదులనూ కలుపుతున్నారు.  ఇంధ్రాదులు అమ్మవారి భక్తులన్నది ప్రసిధ్ధమే.  శ్రీవిద్యాసంపదాయ ఋషులలో ఇంద్రుడూ ఒకడు కదా.

అలాగే అమరలలనా అని దేవతా స్త్రీలనూ స్మరిస్తున్నారు. అంటే అప్సరసలనూ ప్రస్తావిస్తున్నారన్నమాట.

శ్లోకాంతంలో గిరిశః అని ఒక మాట వేసారు.  మరేమీ కొత్తమాట కాదు గిరీశ శబ్ధాన్నే హ్రస్వంగా వాడారు. గిరీశుడు అంటే శివుడు.

సరే, శ్లోకంలోని విషయం చూదాం.

శ్రీశంకరులు అంటున్నారు. అమ్మా, తుహినగిరి కన్యా, త్వదీయం అంటే నీయొక్క సౌందర్యం అనగా సౌందర్యాన్ని గురించి మరొకదాని సౌందర్యంతో పోల్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.  ఎవరు?  విరించి ప్రభృతులు. ఎందుకు? వాళ్ళంతా మరి కవీంధ్రాః అనగా మహాకవులు కదా?

మరి వారి ప్రయత్నం ఫలిస్తున్నదా? ఎలా ఫలిస్తుందమ్మా?  ఆ బ్రహ్మగారు సకలసృష్టికీ సమర్థుడైనవాడు కావచ్చును.  ఇంద్రాదులకు లోకంలో తెలియని సంగతీ ఉండకపోవచ్చును. కాని వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, అమ్మా, కథమపి కల్పంతే - అనగా ఏవేవో పిచ్చిపిచ్చి కల్పనలు మాత్రం చేస్తున్నారు. నీ సౌందర్యం వాళ్ళ యొక్క కవితా సమర్థతలకు మించినది మరి.

అమ్మవారి సౌందర్యం లోకాతీతమైనది. అద్వితీయమైనది. కాబట్టి, ఈ లోకాలకు మాత్రమే పరిమితమైన ప్రజ్ఞకల బ్రహ్మగారూ. ఇంద్రుడు వగైరా కవులకు నీ సౌందర్యాన్ని కవిత్వంలో పట్టుకోవటం అసాధ్యంగా ఉంది అందుచేత అని శ్రీశంకరులు చమత్కరిస్తున్నారు.

ఇకపోతే సౌందర్యం విషయంలో విర్రవీగే సజ్జు మరొకటి ఉంది. అదే దేవలోకంలోని అప్సరసల సమూహం.  వాళ్ళేం చేస్తున్నారో చూడమ్మా అని ఇలా చెబుతున్నారు.

అమరలలనాః అనగా ఆ అప్సరసలు నీ యొక్క అద్వితీయమైన సౌందర్యం వంక ఔత్సుక్యాః అనగా ఎంతగొప్పదో చూదాం అన్న కుతూహలంతో వచ్చి  యదాః ఆలోక్యః  అంటే దాన్ని తిలకించి, దాని దరిదాపులకు కూడా రాలేక మూలన బడ్డామని గ్రహించారు.  అందుకని వాళ్ళేం చేసారో చూడమ్మా అని శ్రీశంకరులు ఒక మాట అంటున్నారు.

గిరిశసాయుజ్యం అని ఒకటి ఉంది కదా. అంటే శ్రీసదాశివుడిని చేరుకోవటం అని ప్రస్తావిస్తున్నారు.

మోక్షం అనేది ఐదు రకాలు అని సంప్రదాయం. సాలోక్యం, సామీప్యం సారూప్యం,  సార్ఘ్యం, సాయుజ్యం  అని.  ఆ పైది కైవల్యం అన్నది సంపూర్ణమోక్షం.

సాలోక్యం అంటే ఇష్టదైవం యొక్క లోకం ఏదో దానిలో నివాసం పొందటం. అంటే వైకుంఠ లేదా కైలాసప్రాప్తి అన్నమాట.

సామీప్యం అంటే ఇష్టదైవం యొక్క సమీపంలో నిత్యం వసించే అదృష్టం సంపాదించుకోవటం. కులశేఖర ఆళ్వారు వారు శ్రీనివాసుడి సామీప్యాన్ని అపేక్షించి ఆయన సమీపంలో ఆయన ముంగిలిలో గడపగా ఉన్నాడని చెబుతారు. అలాగ అన్నమాట.

సారూప్యం అంటే ఇష్టదైవం యొక్క స్వరూపాన్ని తానూ పొందటం.

సార్ఘ్యం అంటే  సారూప్యంతో పాటు, ఆపైన ఇష్టదైవానికి జరిగినట్లుగా తనకూ అదే విధమైన సర్వ పూజాగౌరవాలూ కలగటం.

సాయుజ్యం అంటే ఇష్టదైవంతో నిత్యం  కలసి ఉండటం.

ఇక కైవల్యం అంటే పరబ్రహ్మస్వరూపంలో లీనం ఐపోవటం. ఇంక నేను అంటే ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏదీ ఉందదు,  కేవలం బ్రహ్మమే ఐపోవటమే.

సాధారణంగా సాహిత్యంలో ఈ మోక్షభూమికలను అన్నీ కలగాపులగంగా కూడా వాడుతూ ఉంటారు.

ఇక్కడ శ్రీశంకరులు సాయుజ్యం అని భలేగా సాభిప్రాయంగా వాడారు. అప్సరసలంతా సాక్షాత్తూ శ్రీసదాశివుడితో కలసి ఉండాలి అని అబిప్రాయపడి దానికోసం మనసా యాంతి  తాపత్రయం పడుతున్నారట, ఆ కలయిక కోసం మానసికంగానే. ఎందుకంట్ అది సిధ్దించేది కాదాయెను.

మరి శివసాయుజ్యం మాటలా? కాదే! అది తపోభిః అపి దుష్ప్రాపామ్  అంటే తపస్సు చేత కూడా పొందటానికి వీలు కానిది అని శ్రీశంకరులు అంటున్నారు.

ఎందుకు తపస్సుచేత కూడా పొందటానికి వీలు కాదూ, శివసాయుజ్యాన్నీ అంటే శ్రీసదాశివుడితో నిత్యం కలసి ఉండేది అమ్మ మాత్రమే కదా? 

బ్రహ్మాదులకు తమ అసమర్థత తెలిసి వచ్చింది.  అప్సరోగణాలకు తమ హీనసౌందర్యం మీద వెగటు పుట్టింది.

అమ్మకు సాటి అంటూ ఎక్కడన్నా ఉంటుందా? 

ఈ శ్లోకానికి నిత్యం రోజుకు వేయిసార్లు పారాయణం. అలా నలభై రోజులు. నైవేద్యం తేనె.  ఫలం వాక్సిధ్ధి, వాక్శుధ్ధి, విద్యాప్రావీణ్యత, లోకామోదం.