ఈ రోజున మనవు బ్లాగు టపా అమర వీరుల త్యాగ పలితం, ధరల తెలంగాణా ! దొరల తెలంగాణా! బాగుంది. ఆలోచనీయమైన విషయాలు స్పృశించారు. సుమారు 1300 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే కాని తెలంగాణాకు విముక్తి లభించలేదు ఈ సంఖ్య విషయంలో పెద్ద గందరగోళం ఉంది. మొన్నమొన్నటిదాకా వినిపించిన కొన్ని వందల నుండి నేటి కొన్నివేల వరకూ యీ అమరవీరులసంఖ్యను ఎవరికి తోచిన విధగా వారు నొక్కివక్కాణిస్తున్నారు. ఆ మధ్యన ఒకాయన టీవీలో మాట్లాడుతూ అనేకవేలమంది అన్నాడు. దివంగతముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగారి మృతికి సంతాపసూచకంగా కూడా అసంఖ్యాకంగా తెలుగుప్రజానీకం గుండెపగిలి చనిపోయారట. వారినందరినీ ఓదార్చటానికి ఆయన పుత్రరత్నం జగన్మోహనుడు గత రెండేళ్ళనుండీ, ఇంకా ఓదార్పుయాత్రలు చేస్తూనే ఉన్నాడు. మరో దశాబ్దానికీ అవి పూర్తయ్యే అవకాశం కనిపించటం లేదు. ఈ రెండు విషయాలూ కలిపి ఎందుకు ముచ్చటించానూ అంటే, ఇలా చనిపోయిన వారు కూడా రాజకీయప్రవారాస్త్రాలుగా మారటం అనే హీనమైన పరిస్థితిపైన ఆక్షేపణతోటే. ఈ రెండు సంధర్భాలలోనూ చనిపోయినవారి సంఖ్య కన్నా ప్రచారం చేయబడుతున్న సంఖ్యను రాజకీయావసరాలకోసమే భూతద్దాల్లోంచి చూపే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పటమే నా ఉద్దేశం. తెలంగాణా ప్రకటించాక ఈ అమరవీరుల కుటుంబాల వారెవ్వరూ "సంబురాల్లో " పాల్గొన్నట్లు మీడియాలో ఎక్కడా కనిపించలేదు . ఎలా కనిపిస్తారు? వారి బలిదానాల యొక్క ప్రయోజనం ఉద్యమజ్వాలలను ఎగదోయటమే. ఉద్యమపరిణామానికి వారి సంఖ్య ప్రధానం కాని వారు కాదు. అందుకే వారిని స్మరించటానికి ఎన్నో ఆర్భాటాలు చేస్తారు కాని వారి కుటుంబాలను నిజంగా ఎవరూ పట్టించుకోరు. సముచితగౌరవం దక్కాలని ఆయా మృతుల కుటుంబాలవారు కోరుకుంటున్నారో లేదో చెప్పటం కష్టం. ఒక వేళ ఎవరైన అలా భావించినా విజయోత్సాహవేళల్లో విజేతల నాయకుల ముఖారవిందాలూ పాదారవిందాలూ కొలుపులు అందుకుంటాయి గాని మధ్యలో నలిగిన సామాన్యుల స్మృతులు కావు. ఇదేమీ వింతవిషయమూ కాదు కొత్తవిషయమూ కాదు. కృష్ణదేవరాయలు ఫలానా యుధ్ధంలో గొప్పగా విజయం సాధించాడంటామే కాని ఆ విజయం అందించటంకోసం రాలిపోయిన సైనికుల పేర్ల పట్టీని గురించి ఎవరూ మాట్లాడరు కదా. అంతే. తెలంగాణాకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసాక ఏ దళిత నాయకుడిని వెంటపెట్టుకుని సోనియా గాంది గారి దగ్గరకు వెళ్లి "అమ్మా . వీరి అభ్యదయం కోసమే వీర తెలంగాణా అని చెప్పిన పాపాన పోలేదు ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీలేదు. ఒక నాయకడి ప్రక్కన నిలబడి నడవటాని కి ఆనాయకుడికి అత్యంత ఆంతరంగికులు అర్హత కలిగి ఉంటారు కాని ఇతరులు కారు కదా? ఒక దళితనాయకుడిని రేపు కేసీఆర్‌గారు ముఖ్యమంత్రిని చేయవచ్చును. ఆ సందర్భంలో ఆయనను సోనియాకు పరిచయం చేయవచ్చును. ప్రస్తుతం ఆయన చేసింది, తానూ తన సైన్యాధిపతులూ పోయి చక్రవర్తిని సందర్శనం చేసి విధేయత ప్రకటించటం. ఆ సందర్భంలో, తాను నియమించబోయే ఒక్ ఉన్నతాధికారిని వెంటబెట్టుకొని వెళ్ళవలసిన అగత్యం లేదు. నిన్న "దొరబిడ్డ " డిల్లి నుండి హైదరాబాద్ కు వచ్చిన వేళ , బేగంపేట విమానాశ్రయం నుండి దొరబిడ్డ నివాసం వరకు సాగిన కార్ల ర్యాలి చూస్తుంటే పూర్వపు "దొరల తెలంగాణా " వచ్చినట్లే ఉంది కాని , ఎక్కడా అంబేద్కర్ గారు చెప్పిన సామాజిక తెలంగాణా వస్తుందన్న ఆశ లేశమంతైనా కలుగలేదు సామాజికతెలంగాణా వంటి వన్నీ వట్టి గారడీ మాటలు. చీటికీ మాటికీ రాజకీయ పక్షులు అంబేద్కర్ పేరెత్తటమూ నిత్యం వాళ్ళు చేసే రాజకీయగారడీలో భాగమే. ఇది ఒక యుధ్ధవిజయం వంటిది తెలంగాణాకు - ఈ మాట వినటానికి సీమాంద్రులకు వంటికికారం రాసినట్లున్నా - అది నిజం. కేసీఆర్ ఒక విజేత. ఒక యుధ్ధవిజేతకు ఎటువంటి స్వాగతం లభిస్తుందో అటువంటి స్వాగతమే ఆయనకూ లభిస్తోంది. పాంపే విజయం తరువాత జూలియస్ సీజర్కు కూడా ఇటువంటి పౌరస్వాగతమే లభించింది. కెసీఆర్ నిజంగా రాజు కానట్లే ఆనాడు సీజర్ కూడా నిజంగా మకుటధారి ఐన రాజు కాడు. ఇకపోతే ప్రజానాయకులు నిరాడంబరంగా ఉండాలి వంటి పలుకులన్నీ పాతమాటలు. ఈ రోజున మంత్రులబిడ్దల పెళ్ళిళ్ళకు వందలకోట్లు ఖర్చుపెడుతున్నారు. ఒక రాజ్యాధిపతిస్థితిలో ఉన్నవారికి ఇచ్చే స్వాగతం, అదీ విజయోత్సవస్వాగతం ఎంత ఘనంగా ఉండాలీ? పూర్వపు దొరల కాలంలో ఇలా జరిగేది కాని ఇప్పు డేమిటీ అనలేము. దొరలెప్పుడూదొరలే. ఘనతవహించిన నిజాం నవాబుగారి ప్రస్తుతిలో ఒళ్ళు మరచి ఔచిత్యం అంచులదాకా వెళ్ళిపోయిన నియోనవాబుగారికి సామాన్యంగా ఉండే స్వాగతోత్సవం ఆగ్రహం తెప్పించవచ్చును! మరి 10 సంవత్సరాలు నుండి కష్టపడుతున్న అయన పార్టీ కార్య కర్తలకు ఏమైనా లబిస్తుందా అంటే అనుమానమే....గులాబీ దళాలు పోరాడి అధికారం కాంగ్రెస్ దొరలకు అప్ప చెప్పుడు తప్పా , తెలంగాణలో వచ్చె మార్పు ఏముంది ? కార్యకర్తలు ఎప్పుడూ విధేయతగల కార్యకర్తలుగానే గౌరవించబడతారు. వీళ్ళు అక్షరాలా చదరంగంలో పావులవంటి వారు. ఏదో సినిమా డైలాగులో అన్నట్లు, కార్యకర్తలవంటి పావులు ఎదిరిబలంతో పోరాడటానికే పనికి వస్తారు కాని అధికారం పంచుకుందుకు కాదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏముంది? ఎప్పుడు చూసినా అన్ని పార్టీలలోనూ కార్యకర్తలు కార్యకర్తలుగానె పుడతారు గిడతారు. నాయకులు నాయకుల ఇండ్లనుండే వస్తారు. కార్యకర్తల ఇండ్లనుండి కార్యకర్తలే రావాలి. అది రూలు. ఇప్పుడు తెరాసా కార్యకర్తలకు వచ్చే మార్పు అంటారా, వాళ్ళ కండువాల డిజైన్ మరియు రంగులు మారతాయి అంతే. పోరాటం చేయటానికి వారికి ఎప్పూడూ స్వాగతం పలుకుతారు అధినేతలు. పోరాడే హక్కు తప్ప మరేదైనా లభించాలని కార్యకర్తలు కోరుకోవటం అత్యాశక్రింద లెక్కించబడుతుంది. సిమాంధ్రా వారికే ప్రత్యెక హోదాలు , ఉచిత పోలవరం ప్రాజెక్టు , బోల్డన్ని రాయితీలతో కూడిన ప్యాకేజీలు , కొత్త రాజదాని ఇలా ఎన్నో సౌకర్యాలు సమకూరి 10 సంవత్సరాలలో దేశంలో ఒక గుర్తింపు స్తాయికి చేరే అవకాశం ఉంది అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఏమేమి సమకూరినా వాటిలో సింహభాగం కొట్టేయటానికి రాజకీయనాయకులకు సీమాంధ్రలో కొరత ఏమీ లేదు. అసలు సీమాంధ్రకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాలకు ఏమి హామీ ఉంది? ఏమీ చట్టబధ్ధత లేని ఈ హామీలు కేవలం సీమాంధ్రలో చెడిన తమ స్థానాన్ని పునర్వికాసం పొందించుకుందుకు కాంగ్రెసు ఆడుతున్న నాటకాలే తప్ప వీటి మరే విలువా ఇవ్వలేం. కొన్ని దశాబ్దులుగా సీమాంధ్రులు కూడా హైదరాబాదుకు తమ శక్తియుక్తుల్ని ధారబోసారు - కనీసం వారలా భావిస్తున్నారు. ఇప్పుడు కేవలం దశాబ్దం కాలంలో సీమాంధ్రను బంగారుభూమి చేయటం అనేది ఒక కమ్మటికల కన్నా మరేమీ కాదు. తెలంగాణా కి హైదరాబాద్ ఆదాయం తప్ప చెప్పుకోవటానికి ఏమి లేదు . ఆ హైదరాబాద్‌లో కూడా సగం మంది పైగా సిమాంధ్రకి చెందిన వారే ! వినండి వినండి మనవు గారి ఉవాచ. హైదరాబాద్‌లో కూడా సగం మంది పైగా సిమాంధ్రకి చెందిన వారే అంటున్నారు వారు. మరి కేసీఆర్‌గారు వేదికలెక్కి గర్జించారు కదా హైదరాబాదులో సీమాంధ్రుల సంఖ్య నాలుగైదు లక్షలకు మించదని? హైదరాబాదునుండే సమైక్యాంధ్రప్రదేశానికి 70% పైన ఆదాయం వస్తోంది. ఈ సంగతి వెనుక హైదరాబాదు గొప్ప కన్నా మన నాయకమ్మన్యుల తెలివితక్కువ ప్రణాళికలో వారి ప్రణాళికా రాహిత్యమో ప్రస్ఫుటంగా లేదా? ఈ సమైక్యాంధ్రప్రదేశానికి హైదరాబాదు ఒక్కటే నగరమా? ఇతరనగరాలలో కూడా అభివృధ్ధికి వీరు ఎందుకు ప్రయత్నమే చేయలేదు? హైదరాబాదు మీద ఏహక్కులేని స్థితి ఒకటి రావటాన్ని అందుకే సీమాంధ్రులు తట్టుకోలేక పోతున్నారు. ఒక్క ఈ నగరం తప్ప వేరే చోట్ల అభివృధ్ధి లేదని నేడు తెలంగాణావారూ వాపోతున్నారు. భేష్. ముందుచూపు లేని ఈ నాయకులు ఇప్పటికైనా కళ్ళుతెరవాలని కోరుకుందాం. ... ఒక్క సారిగా తెల్లారే పాటికి ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు....ఏంతో ఆశగా ఉన్నారు. ఇలాంటి ఆచరణసాధ్యం కాని ఆశలు రేపి తెలంగాణాలోని అమాయకయువకులను మోసం చేసింది ఎవరూ? ఈ రోజున ఊరేగింపులు చేస్తున్న, చేయించుకుంటున్న వీరవరేణ్యులు కారా? రెండేళ్ళ క్రిందట జరిగిన, ఒక యధార్థం సంఘటన చెబుతాను. ఒక యువఆటోడ్రైవర్ ఒక ఉద్యోగిని మైండ్‌స్పేస్ లోని ఒక ఆఫీస్ భవనం గేటు దగ్గర దించాడు. ఆటో దిగిన ఉద్యోగితో "మేడమ్, రేపు తెలంగాణా వస్తుంది కదా, మీ ఆంధ్రోళ్ళంతా వెళ్ళిపోయాక ఈ ఆఫీసుల్లో ఉద్యోగాలన్నీ మా కిచ్చేస్తారు కదా" అని అడిగాడు. పాపం, ఆమెకు ఎం చెప్పాలో అర్థం కాలేదు. ...దొరల పాలనలో ధరల బారం తో కుంగిపోవడం తప్పా , కొత్తగా వచ్చె లాభాలేంటో ఇంతవరకు తెలంగాణా ప్రజలుకు తెలియదు . అనంతకోటి లాభాలు వచ్చి మీదపడిపోతున్నాయని ఇన్నాళ్ళు ఊదరగొడుతున్న ఉద్యమనాయకుల్ని నిలదీసి అడగవలసిన ప్రశ్న యిది. ఉద్యోగులకు జీతాలివ్వటానికీ డబ్బుల్లేని సీమాంధ్రరాష్ట్రమూ, హైదరాబాదుమీద వచ్చే ఆదాయం తెలంగాణా రాష్ట్రం లో ఏర్పడే కరెంట్ లోటు ను పూడ్చడానికే వినియోగించ వలసిన పరిస్థితిలో తెలంగాణరాష్ట్రమూ రెండూ కష్టాలసుడిగుండంలో చిక్కుకోవటం తప్పని పరిస్థితి. జనం మిద ధరల పిడుగులుతో రెండు రాష్ట్రాలూ ఇబ్బందిపడక తప్పదు. క్రుంగిపోవటం తప్ప కొత్తగా వచ్చే లాభాలేమిటో సీమాంధ్రప్రజలకూ తెలియదు, తెలంగాణాప్రజలకూ తెలియదు. |
26, ఫిబ్రవరి 2014, బుధవారం
దొరల తెలంగాణాయేనా అంటున్న మనవు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)